దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని వైఎస్ జగన్ సర్కార్ నిర్వహించలేదు. వైసీపీ శ్రేణులు నిర్వహించాయి. అది రాజకీయ కార్యక్రమం. ఊరూ వాడా వైఎస్సార్ వర్ధంతిని పండగలా జరుపుకున్నారు వైసీపీ నేతలు, కార్యకర్తలు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఆయన కుటుంబ సభ్యులు పులివెందులలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ఘన నివాళులర్పించారు. ఇది ప్రతియేటా జరిగే తంతు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు.. ముఖ్యమంత్రి పదవిలో వుండగానే, అధికారిక పర్యటన నిమిత్తం వెళుతూ హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అదొక దారుణ ఘటన. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటే, వైఎస్సార్ వర్ధంతికీ, వినాయక చవితి వేడుకలకీ లింకు పెట్టారు ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు. వైఎస్సార్ వర్ధంతిని ఘనంగా నిర్వహించినప్పుడు రాని కోవిడ్ నిబంధనల అడ్డు.. ఇప్పుడు వినాయక చవితి వేడుకల విషయంలో ఎందుకు.? అన్నది చంద్రబాబు ప్రశ్న.
వైఎస్సార్ వర్ధంతిని వైసీపీ శ్రేణులు జరుపుకున్నాయి. వినాయక చవితి వేడుకలు అలా కాదు కదా.. రాష్ట్ర ప్రజలంతా జరుపుకుంటారు. నిజమే, వైఎస్సార్ వర్ధంతి నేపథ్యంలో వైసీపీ శ్రేణులు అత్యుత్సాహమే ప్రదర్శించాయి. అధినేత మెప్పు కోసం కొందరు వైసీపీ నేతలు కాస్త హంగామా ఎక్కువే చేశారు. ప్రతిపక్షం టీడీపీ ఏం చేయాలి.? ఆ అత్యుత్సాహంపై పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చు.. కోర్టులను ఆశ్రయించొచ్చు. అంతే తప్ప, వాటికి అనుమతిచ్చారు కాబట్టి, కోవిడ్ 19 విజృంభిస్తున్నా వినాయక చవితి వేడుకలకు అనుమతినివ్వాల్సిందేనంటే ఎలా.? పైగా, కేంద్రమే.. పండుగల విషయంలో అప్రమత్తంగా వుండాలని సూచించిందాయె. ఇక్కడ వైఎస్ జగన్ సర్కార్ కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. తమకు నచ్చిన కార్యక్రమాలకు అనుమతులిచ్చి, వివాదాలకు తావిచ్చేలా హిందూ మతానికి సంబంధించిన వేడుకల నిర్వహణకు కోవిడ్ 19 పాండమిక్ పరిస్థితుల్ని సాకుగా చూపడం సబబు కాదన్న చర్చ సర్వత్రా జరుగుతోంది.