చంద్రబాబు హైడ్రామా: టీడీపీకి ప్లస్సా.? మైనస్సా.?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగా మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడికి అవమానం జరిగింది. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. అయితే, చట్ట సభల్లో సభ్యులకు అవమానాలు కొత్త కాదు. స్పీకర్ కుర్చీలో ఎవరు కూర్చున్నా.. చట్ట సభల్లో సభ్యులకు గౌరవం దక్కడంలేదు. వ్యవస్థలు అలా తగలబడ్డాయ్ మరి.

అప్పట్లో టీడీపీ, ఇప్పుడు వైసీపీ.. పెద్దగా తేడా ఏమీ లేదు. సభ్యులు పార్టీలవారీగా విడిపోయి, ఒకర్ని ఒకరు అవమానించుకోవడం పరిపాటిగా మారింది. అసలు చట్ట సభలు నిర్వహించేదే ఒకర్ని ఒకరు తిట్టుకోవడానికన్నట్టు తయారైంది పరిస్థితి. ఈ పరిస్థితిని అవసరానికి తగ్గట్టు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుంటున్నారు.

సీనియర్ పొలిటీషియన్ కదా.. అందుకే చంద్రబాబు కూడా ఈ పరిస్థితుల్ని బాగా వాడుకోవాలని డిసైడ్ అయ్యారు.. సభలో కంటతడిపెట్టారు, ఆ తర్వాత మీడియా ముందుకొచ్చి బోరున ఏడ్చారు. సీనియర్ పొలిటీషియన్ చంద్రబాబు వెక్కి వెక్కి మరీ ఏడ్చారంటే.. సింపతీ రాకుండా ఎలా వుంటుంది.?

దేశవ్యాప్తంగా ఇప్పుడీ అంశం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి మీద అభ్యంతరకర వ్యాఖ్యలు అసెంబ్లీలో చేశారట కదా.? అని చర్చించుకుంటున్నారంతా. ఆ వ్యాఖ్యల తాలూకు ఫుటేజ కోసం సోషల్ మీడియలో వెతికేస్తున్నారు నెటిజనం.

లోకేష్ జన్మ రహస్యం గురించి వైసీపీ నేత ఒకరు చేసిన క్వశ్చన్, దాంతోపాటుగా రన్నింగ్ కామెంటరీలో ఎక్కడో అభ్యంతకర పదాలు దొర్లాయని అనుకోవాలేమో. కానీ, ఇది టీడీపీకి ప్లస్ అవుతుందో లేదోగానీ.. వైసీపీకి మాత్రం చాలా బ్యాడ్ అయిపోతుంది. ‘ఇప్పుడు నాకు ఆనందంగా వుంది’ అని రోజా అనడం, గతంలో ఆమెకు జరిగిన అవమానం నేపథ్యంలోనే అయినా.. అది సబబు కాదు.

అంతిమంగా.. చంద్రబాబు మైండ్ గేమ్ అదిరింది.. కానీ, ఈ సింపతీ జస్ట్ ఒకటి రెండు రోజుల తర్వాత చల్లారిపోతుందంతే.