ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసుకున్న కొత్తలోనే అందరికి ఒక ముఖ్యమైన హెచ్చరిక లాంటిది జారీ చేశాడు.. ఈ మంత్రి వర్గం కేవలం రెండున్నరేళ్లు మాత్రమే అని, ఈ మధ్య కాలంలో సరిగ్గా పనిచేయని మంత్రులను తొలగించి, వాళ్ళ స్థానంలో కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తానని చెప్పటం జరిగింది. సీఎం జగన్ చెప్పిన ఆ మాటలు మంత్రుల పనితీరుపై గట్టిగానే ప్రభావం చూపించాయి.
దీనితో చాలా మంది మంత్రులు తమ తమ బాధ్యతలను గట్టిగానే నిర్వర్తించారు. మరికొందరు మాత్రం సీఎం జగన్ అంచనాలను అందుకోవడంలో విఫలం కావటమే కాకుండా, అనేక ఆరోపణలు ముట్టకట్టుకున్నారు. అలాంటి వారిని సీఎం జగన్ నిర్మొహమాటంగా ఇంటికి పంపించే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే జగన్ మంత్రి వర్గం నుండి వెళ్లిపోయే మంత్రులు వీళ్ళే అంటూ ఒక లిస్ట్ మీడియా సర్కిల్ లో హల్ చల్ చేస్తుంది. అందులో మొదటి పేరు గుమ్మనూరు జయరాం. కర్నూల్ జిల్లా నుండి మంత్రిగా ఉంటున్న ఆయన మీద ఇప్పటికే అనేక ఆరోపణలు వస్తున్నాయి. అవి అధినేత దృష్టికి వెళ్లినట్లు తెలుస్తుంది.
అలాగే కడప జిల్లాలో అంజాద్ బాషా ని తొలగించి ఆయన స్థానంలో రాయచోటి ఎమ్మెల్సీ కి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరో పక్క నెల్లూరు లో గౌతమ్ రెడ్డి పని తీరుపై కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఆయన్ని తప్పించి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మరో నేతకు మంత్రి పదవి ఇచ్చే ఆలోచనలో సీఎం ఉన్నట్లు తెలుస్తుంది. అదే జిల్లాకు చెందిన మరో మంత్రి అనిల్ కుమార్ విషయంలో కూడా సీఎం జగన్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. దూకుడైన మంత్రి అని అనిల్ కుమార్ కు పేరుంది కానీ, జగన్ మాత్రం ఆయన విషయంలో హ్యాపీ లేనట్లు తెలుస్తుంది. ఆయన స్థానంలో యాదవ సామాజిక వర్గానికి చెందిన కృష్ణాజిల్లా పెనుమలూరు కొలుసు పార్థసారథికి మంత్రి గిరి ఇచ్చే అవకాశం వుంది.
ఇక ప్రకాశం జిల్లాలో కూడా ఇద్దరు మంత్రులు వున్నారు, ఒకరు సీనియర్ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, మరొకరు ఆదిమలుపు సురేష్. ఇందులో ఒకరిని తప్పించే అవకాశం ఉందని తెలుస్తుంది. బాలినేని సీనియర్ మరియు సీఎం జగన్ కి దగ్గరి బంధువు, ప్రకాశం జిల్లాలో వైసీపీకి కీలకమైన నేత కాబట్టి ఆయనను మంత్రి పదవి నుండి తప్పించే అవకాశం చాలా వరకు తక్కువ అనే చెప్పాలి, కాబట్టి ఆదిమలుపు సురేష్ కి ఇబ్బంది తప్పకపోవచ్చు. ఇక గుంటూరు విషయంలో జగన్ సంతోషంగానే ఉన్నట్లు సమాచారం.
కృష్ణ జిల్లాలో కొడాలి నాని నోటి దురుసు మీద ఆరోపణలు వస్తున్నాయి. అవి పార్టీకి నష్టం కలిగించే విధంగా ఉండటంతో, జగన్ ప్రస్తుతానికి కొడాలి నాని మీద కోపంతో ఉన్నట్లు సమాచారం. ఆయన్ని మంత్రి పదవి నుండి తొలిగిస్తే ఆ స్థానంలో పశ్చిమ గోదావరి జిల్లాకి చెందిన అబయ్య చౌదరి కి ఇచ్చే అవకాశం వుంది. గోదావరి జిల్లాల నుండి శ్రీకాకుళం వరకు ఇప్పుడున్న వాళ్ళ లో ఒక్క బొత్స సత్యనారాయణ్ని తప్ప మిగిలిన వాళ్ళని మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే పైన పేర్కొన్న జాబితాలో మార్పులు చేర్పులు వుండే అవకాశం వుంది. ఈ జాబితా కేవలం మీడియాలో జరుగుతున్నా ఒక ప్రచారం మాత్రమే