సాధారణంగా అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుండి మూడు సంవత్సరాల వరకు తల్లిపాలు పిల్లలకు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయి. ముఖ్యంగా ఏడాది వరకు పిల్లలకు తల్లిపాలు తప్పనిసరిగా పట్టించాలి. అయితే ప్రసవం తర్వాత కొంతమందిలో పాలు లేక పిల్లలకు పాల పౌడర్ కలిపి పాలు పట్టించడం లేదా పోత పాలు పట్టించడం చేస్తున్నారు. అలాకాకుండా బాలింతలు వారు తీసుకునే ఆహారం విషయంలో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల పిల్లలకు సరిపడా పాలు పడతాయి. బాలింతలలో పాల ఉత్పత్తి పెరగటానికి తీసుకోవలసిన ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
వెల్లుల్లి రెబ్బలలో పాల ఉత్పత్తిని పెంచే గుణాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే బాలింతలకు ఎక్కువగా వెల్లుల్లితో ఆహార పదార్థాలు తయారు చేసి ఇస్తూ ఉంటారు. బాలింతలు వారు తినే ఆహార పదార్థాలలో వెల్లుల్లిని ఎక్కువగా చేర్చుకోవడం లేదంటే వెల్లుల్లితో పచ్చడి వంటివి చేసుకొని తినటం వల్ల బాలింతలలో పాల ఉత్పత్తి పెరుగుతుంది. అంతేకాకుండా బాలింతలు ఎక్కువగా మటన్ తినడం వల్ల కూడా వారిలో పాల ఉత్పత్తి పెరుగుతుంది. మటన్ లో లాక్టోజెనిక్ గుణాలు ఎక్కువగా ఉండటం వల్ల ఇవి బాలింతలలో పాల ఉత్పత్తిని పెంపొందిస్తాయి. బాలింతలు పాలు, బ్రెడ్ కలిపి తినడం వల్ల కూడా వారిలో పాల ఉత్పత్తి పెరుగుతుంది.
ఇక మెంతులలో కూడా పాల ఉత్పత్తిని పెంచే గుణాలు ఎన్నో ఉన్నాయి. ఒక టేబుల్ స్పూన్ మెంతులను ఒక గ్లాసు నీటిలో బాగా మరిగించి ఆ నీటిలో కొంచెం తేనె కలుపుకొని తాగడం వల్ల పాల ఉత్పత్తి పెరుగుతుంది. బాలింతలలో పాల ఉత్పత్తిని పెంచేందుకు మునక్కాయలు కూడా ఎంతో ఉపయోగపడతాయి. బాలింతలు తరచుగా మునగ కాయలతో తయారుచేసిన కూరలు లేదా మునగకాయల వేపుడు వంటివి ఎక్కువగా తినటం వల్ల కూడా వారిలో పాల ఉత్పత్తి పెరుగుతుంది.