బీజేపీకి వైసీపీతో అవసరం.! కానీ, జనసేనతో స్నేహం.!

భారతీయ జనతా పార్టీకి జాతీయ స్థాయిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో అవసరం. అదే సమయంలో, ఆంధ్రప్రదేశ్‌లో జనసేనతో బీజేపీ నడుపుతోంది స్నేహం.! ఏపీ బీజేపీ నేతలు వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నా, బీజేపీ జాతీయ స్థాయి నాయకులూ ఏపీలోని అధికార వైసీపీ మీద అడపా దడపా విమర్శలు చేస్తున్నా.. తెరవెనుకాల కథ వేరేలా వుంది.

పార్లమెంటులో బిల్లుల్ని పాస్ చేయించుకోవడం విషయంలో కావొచ్చు, ఇతరత్రా విషయాల్లో కావొచ్చు, కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహాయ సహకారాలు అవసరం. ఈ నేపథ్యంలోనే, తెరవెనుకాల వైసీపీతో బీజేపీ పెద్దలు స్నేహం నడపాల్సిన పరిస్థితి.

తాజాగా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తూ వైసీపీ సర్కారు మీద విమర్శలు చేసేస్తున్నారు. మరోపక్క, ఏపీ సర్కారు కోరిక మేరకు, టీటీడీ ఈవో ధర్మారెడ్డి విషయమై సానుకూలంగా స్పందించింది కేంద్రం. అమరావతి విషయంలో వైసీపీ సర్కారు అభాసు పాలవడకుండా కాపాడింది కూడా కేంద్రమే. ‘రాజధాని అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం..’ అంటూ పదే పదే కేంద్రం తెగేసి చెప్పింది. కానీ, ఆ అమరావతి విషయంలో బీజేపీ, ఏపీ సర్కారుపై నానా యాగీ చేసింది.

భారతీయ జనతా పార్టీ వేరు, ఆ పార్టీ సారధ్యంలో నడుస్తున్న బీజేపీ ప్రభుత్వం వేరు. భారతీయ జనతా పార్టీ నేతలేమో, వైసీపీనీ, వైసీపీ సర్కారునీ విమర్శిస్తారు. బీజేపీ ప్రభుత్వ పెద్దలేమో, వైసీపీ ప్రభుత్వాన్ని ఆదుకుంటారు. ఇదీ గడచిన మూడేళ్ళుగా నడుస్తున్న వ్యవహారం.

వైసీపీ కూడా అంతే. కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కారుకి అవసరమైనప్పుడు వైసీపీ సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తుంటుంది. అదే సమయంలో, రాష్ట్రానికి అవసరమైన విషయాల్లో వైసీపీ సర్కారు కేంద్రాన్ని నిలదీయకుండా వుంటుంది. దీన్ని ఏ రకమైన రాజకీయం అనాలో ఏమో.!