తెలుగు రాజకీయాలు అందునా ఆంధ్రా రాజకీయాలు ఉత్తరాది రాజకీయాలకు పూర్తి భిన్నమైనవి. ఇక్కడ కులం కార్డు ఘనంగా పనిచేస్తుంది. ఎంతమంది నేతలు ఎన్ని మాటలు చెప్పినా చివరికి టికెట్ కేటాయింపుల దగ్గర్నుండి, గెలుపోటముల వరకు అన్నీ కులం ప్రాతిపదికనే డిసైడ్ అవుతుంటాయి. అందుకే ఏపీ బీజేపీ కూడ కులం ప్రాతిపదికన రాజకీయాలు చేయడానికి సన్నద్ధమవుతోంది.. అందుకే రాష్ట్రంలో ఉన్న మూడు ప్రధాన సామాజికవర్గాల మీద దృష్టి పెట్టింది. ముఖ్యమైన కమ్మ, కాపు, రెడ్డి సామాజికవర్గాలను ప్రసన్నం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే కమ్మ, కాపులకు పార్టీలో ప్రాధాన్యం ఉంటుందనే సంకేతాలిచ్చి వారిని ఆకర్షించే పనిపెట్టుకున్న భారతీయ జనతా పార్టీ ఇప్పుడు రెడ్డి సామాజికవర్గం మీద గురి పెట్టింది.
ప్రధానంగా వైసీపీలో అసంతృప్తితో ఉన్న రెడ్డి నాయకులను పార్టీలోకి లాగాలని ట్రై చేస్తోంది. అందులో భాగంగానే గుంటూరు జిల్లా రాజకీయాల్లో మంచి పేరుకున్న మోదుగుల వేణుగోపాల రెడ్డికి గాలం వేస్తోంది. గత ఎన్నికల ముందు టీడీపీ నుండి వైసీపీలోకి వచ్చిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గుంటూరు పార్లమెంట్ స్థానం నుండి పోటీచేసి ఓడిపోయారు. అప్పటి నుండి పార్టీలో ఆయన మాటకు విలువ లేకుండా పోయింది. పేరుకు రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతే అయినా, మంచి క్యాడర్ ఉన్నా పదవి లేకపోవడంతో ఆయన హవా తగ్గింది. ఓడిపోయినా తనకు పదవి దక్కుతుందని ఆశపడిన ఆయనకు జగన్ నుండి ఎలాంటి సానుకూల స్పందన రాలేదు.
ఎమ్మెల్సీ స్థానాలకు కూడా అభ్యర్థుల ఎంపిక పూర్తికావడంతో ఆయనక్లు పదవి దక్కుతుందనే ఆశలు పూర్తిగా ఆవిరైపోయాయి. అందుకే ఆయనకు వలవేసి పార్టీలో ప్రాముఖ్యం ఉన్న స్థానం అప్పగిస్తామని ఆశపెట్టి తమకలో కలుపుకోవాలని బీజేపీ ఎత్తులు వేస్తోందట. పైగా బీజేపీలో రెడ్డి నేతలు సంఖ్య చాలా తక్కువ. కాబట్టి పార్టీలోకి వస్తే బలమైన సామాజికవర్గానికి ప్రతినిధిగా ఉండవచ్చనే సంకేతాలు పంపుతున్నాయట. మరి బీజేపీ నేతలు వేస్తున్న వలకు వేణుగోపాల రెడ్డి చిక్కుతారో లేదో. ఒకవేళ చిక్కితే మాత్రం గుంటూరు రాజకీయాల్లో తమ గొంతుకను బలంగా వినిపించగల నేత బీజేపీకి దొరికినట్టే.