
రాజకీయాల్లో నిన్నటి శత్రువులు నేటి మిత్రులు కావొచ్చు. ఈక్వేషన్స్ ఎప్పుడైనా ఎలాగైనా మారొచ్చు. తిరుపతి ఉప ఎన్నిక ఫలితం తర్వాత భారతీయ జనతా పార్టీ తన సొంత బలం ఏంటన్నది తెలుసుకుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి. జనసేన కంటే ఎక్కువగా ఊహించుకున్న బీజేపీ, ఏకంగా అధికార వైసీపీతోనే పోటీ పెట్టుకుని దారుణ పరాభవాన్ని ఎదుర్కొంది. అసలు టీడీపీని బీజేపీ పరిగణనలోకే తీసుకోలేదు. కానీ, తిరుపతి ఉప ఎన్నిక తర్వాత సీన్ మారింది.
బీజేపీలోని ఒకప్పటి టీడీపీ నేతలంతా ఇప్పుడు బీజేపీ అధిష్టానం వద్ద టీడీపీతో పొత్తు విషయమై ప్రతిపాదనలు పెడుతున్నారట. ‘రాష్ట్రంలో బీజేపీ ఎదగాలంటే, టీడీపీతో పొత్తు తప్పనిసరి. జనసేన కూడా ఈ కూటమిలో వుండాలి..’ అన్నది సదరు మాజీ టీడీపీ నేతలైన, కొందరు బీజేపీ నేతల వాదనగా కనిపిస్తోంది. ‘ముగ్గురం కలిస్తే ప్ప వైసీపీని ఎదుర్కొనలేం..’ అని ఆయా నేతలు, బీజేపీ అధిష్టానానికి తాజాగా ఓ నివేదిక అందించారట. అయితే, టీడీపీతో కలవడానికి బీజేపీ సిద్ధంగానే వున్నా, జనసేన పార్టీ మాత్రం ససేమిరా అంటోందట. ఈ విషయమై ఇటీవల ఏపీ బీజేపీ నేతలకీ, జనసేన నేతలకీ మధ్య చర్చ జరిగిందని సమాచారం. కాగా, బీజేపీతో కలసి పనిచేయడం వల్ల ఉపయోగం లేదనే భావనలో జనసేన వున్నట్లే కనిపిస్తోంది.
రాష్ట్రానికి సంబంధించి కీలక సమస్యల్ని కేంద్రం అడ్రస్ చేయడంలేదన్న భావన జనసేనలో వుంది. అయితే మిత్రపక్షంతో ప్రస్తుతానికి బాధ్యతాయుతంగానే వ్యవహరించాలన్నది జనసేన శ్రేణులకు అధిష్టానం నుంచి అందుతున్న సంకేతం. ఇప్పటికిప్పుడు ఎన్నికల్లేకపోయినా, భవిష్యత్తుపై ఖచ్చితమైన వ్యూహాలతో ముందడుగు వేయాలన్నది జనసేన ఆలోచనగా కనిపిస్తోంది. జనసేనను వదిలించుకుని అయినా టీడీపీతో వెళ్ళడానికే బీజేపీ సిద్ధంగా వుందన్నది రాజకీయ వర్గాల్లో వినిపిస్తోన్న గుసగుసల సారాంశం.
