BJP : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీకి వున్న ఓటు బ్యాంకుని పరిగణనలోకి తీసుకుంటే, ఆ పార్టీ గురించి ప్రధాన రాజకీయ పార్టీలేవీ పెద్దగా మాట్లాడాల్సిన అవసరం కూడా వుండదు. కానీ, జనసేన పార్టీ కూడా బీజేపీతో పొత్తు పెట్టుకుంది. తెలుగుదేశం పార్టీ గతంలో పొత్తు నడిపింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంగతి సరే సరి. పైకి ఏం చెప్పినా, తెరవెనుకాల బీజేపీ – వైసీపీ మధ్య లాలూచీ సుస్పష్టం.
చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టుని బీజేపీ వల్లిస్తోందని వైసీపీ ఆరోపించడం కొత్తేమీ కాదు. జగన్ మోహన్ రెడ్డికి ఎలాంటి ఇబ్బందీ కలగకుండా బీజేపీ వ్యవహరిస్తోందని టీడీపీ ఎద్దేవా చేయడమూ కొత్త కాదు. జనసేన – బీజేపీ మిత్రపక్షాలు గనుక, వాటి గురించి, వాటి మధ్య నడుస్తున్న రాజకీయం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవడమెందుకు.?
చూస్తోంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు సిసలు పవర్ సెంటర్ బీజేపీయేనా.? అనిపించకమానదు. బీజేపీ ప్రస్తావన లేకుండా ఏపీ రాజకీయాలు నడవడంలేదు మరి. బీజేపీని విమర్శించాల్సిన చోట, వైసీపీ మీద విరుచుకుపడటం టీడీపీకి అలవాటైపోయింది. కేంద్రాన్ని నిలదీయాల్సిన చోట, బీజేపీని ప్రశ్నించాల్సిన చోట, టీడీపీని విమర్శించడం వైసీపీకి పరిపాటిగా మారింది.
కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ, రాష్ట్రానికి ప్రత్యేక హోదాని తీసుకురాగల సంపూర్ణ శక్తితో వుంది. అలాంటప్పుడు, బీజేపీని గనుక వైసీపీ – టీడీపీ – జనసేన కలిసి నిలదీస్తే, ఫలితం రాకుండా వుంటుందా.? కానీ, రాష్ట్ర ప్రయోజనాల కంటే ఈ మూడు పార్టీలకీ తమ తమ రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం గనుక.. ఎవరికి వారు విడివిడిగా తమక్కావాల్సిన రాజకీయాలు చేసుకుంటున్నారు.
ఏపీ బీజేపీ, రాష్ట్రంలో జనాగ్రహ సభ నిర్వహించబోతోంది. జనాగ్రహం బీజేపీ మీద వుంది ప్రత్యేక హోదా విషయంలో. మరి, దాన్ని టీడీపీ, వైసీపీ, జనసేన ప్రస్తావించగలవా.?