ఈటెల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగాల్సి వున్న విషయం విదితమే. ఉప ఎన్నికపై కేంద్ర ఎన్నికల సంఘం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోయినా, అప్పుడే రాజకీయ పార్టీలు ఆ నియోజకవర్గంలో ఉప ఎన్నిక వాతావరణాన్ని వేడెక్కించేశాయి. మరోపక్క, తెలంగాణలో ఇంకో అసెంబ్లీ నియోజకవర్గం ఖాళీ అయ్యేలా వుంది. తన నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీయార్ నిధులు కేటాయిస్తానంటే, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ప్రకటన చేశారు. కేసీయార్ నిధులు ప్రకటించిన వెంటనే తాను రాజీనామా చేస్తానన్నది రాజాసింగ్ ప్రకటన సారాంశం. రాజాసింగ్ అంటే ఆషామాషీ వ్యక్తి కాదు. వివాదాలకు కేరాఫ్ అడ్రస్.. సంచలన ప్రకటనలకు కేంద్ర బిందువు.
కొన్ని విషయాల్లో సొంత పార్టీ బీజేపీ పైనా విరుచుకుపడేందుకు వెనుకాడరాయన. దుబ్బాక, నాగార్జునసాగర్, హుజూరాబాద్.. ఇలా ఏ నియోజకవర్గాన్ని తీసుకున్నా.. అక్కడ ఉప ఎన్నిక వాతావరణం రాగానే, తెలంగాణ ప్రభుత్వం సరికొత్త పథకాల్ని ప్రకటించడం ఆనవాయితీగా మారిపోయింది.. పెద్దయెత్తున నిధుల కేటాయింపు.. అంటూ అధికార తెలంగాణ రాష్ట్ర సమితి హంగామా చేయడం చూస్తున్నాం. వందల కోట్లు, వేల కోట్ల స్థాయిలో ఈ పొలిటికల్ పంచాయితీ ప్రతిసారీ నడుస్తూ వస్తోంది. ఉప ఎన్నికలు వస్తేనే, అసెంబ్లీ నియోజకవర్గాలకు వందల కోట్లు, వేల కోట్ల రూపాయల ‘స్పెషల్ ప్యాకేజీలను’ ప్రభుత్వాలు ప్రకటిస్తున్న దరిమిలా.. ఆయా నియోజకవర్గాలు నిజంగానే అభివృద్ధి చెందేస్తున్నాయా.? అంటే, నిధులు ప్రకటించడానికీ.. అభివృద్ధి చేయడానికీ చాలా తేడా వుంటుంది మరి. ఇంతకీ, రాజాసింగ్ సవాల్ విషయమై తెలంగాణ రాష్ట్ర సమితి ఏమంటుందో.?