తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చడీచప్పుడు లేకుండా ఢిల్లీ ఫ్లైట్ ఎక్కాడు. గ్రేటర్ ఎన్నికల సమయంలో కేంద్రంతో తాడో-పేడో తేల్చుకుంటానని చెప్పి ఎన్నికల ఫలితాలు వచ్చిన వారంలోపే ఢిల్లీలో వాలిపోవటం, వరసబెట్టి కేంద్ర మంత్రులను, ప్రధాని మంత్రిని కలవటం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో అనేక అనుమానాలకు తావిస్తుంది.
కేసీఆర్ హస్తిన పర్యటన వెనుక అసలు కారణాలు ఏమిటో తెలియటం లేదు కానీ, పైకి మాత్రం వరద సహాయం, తెలుగు రాష్ట్రాల్లో నీటి పంపకాలు, ఆంధ్ర నిర్మించబోతున్న ఎత్తిపోతల ప్రాజెక్టు గురించి మాట్లాడానికి వెళ్లాడని మాత్రం బయటకు తెలుస్తుంది. లోపల జరిగే వ్యవహారాలు, బయటకు లీక్ అయ్యే వ్యవహారాలు వేరు వేరుగా ఉంటాయనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఇక కేసీఆర్ ఢీల్లీ టూర్ వెళ్లి బీజేపీ పెద్దలను కలిసి రావటంపై రాష్ట్ర బీజేపీ నేతలు విసుర్లు విసురుతున్నారు. అమిత్ షా కి శాలువా కప్పి నమస్కరిస్తున్న కేసీఆర్ ఫొటోని అప్పుడే తెలంగాణ బీజేపీ నేతలు ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. గతంలో నిజాం రాజు, వల్లభాయ్ పటేల్ కు నమస్కరిస్తున్న ఫొటోని జత చేసి, “నియంతృత్వ నైజం.. ఎన్నడైనా చెయ్యవలసిందే ప్రజాస్వామ్యానికి ప్రణామం” అంటూ రెచ్చగొట్టే క్యాప్షన్ పెట్టారు విజయశాంతి.
మరోవైపు కేంద్రం నిధుల్ని రాష్ట్రం దుర్వినియోగం చేస్తోందంటూ కిషన్ రెడ్డి కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. విమానాశ్రయం పేరుతో కేసీఆర్ మాటల గారడీ చేస్తున్నారంటూ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా సెటైర్లు వేశారు. ఒక పక్క బీజేపీ నేతలు ఈ విధంగా ఆరోపణలు చేస్తున్న కానీ, టీఆర్ఎస్ నేతలు మాత్రం కనీసం రియాక్ట్ కాకపోవడం విశేషం. తమ అధినేత ఢిల్లీ టూర్ లో ఉన్నప్పుడు కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడటం కరెక్ట్ కాదనే ఉద్దేశ్యంతోనే తెరాస నేతలు సైలెంట్ గా ఉన్నట్లు తెలుస్తుంది.