బీజేపీ సరికొత్త ఎత్తుగడ.. పవన్‌కు చెక్ పెట్టే దిశగా ప్రయత్నాలు చేస్తుందా.. ? 

 

ఏపీ రాజకీయాల్లో ఊహించని పరిణామాలు రోజుకో విధంగా చోటు చేసుకుంటున్నాయి.. నిన్న మొన్నటి వరకు ఒక్కటిగా ఉన్న పార్టీలు కొత్త ఎత్తులతో ముందుకు వెళ్లుతున్నాయి.. ప్రస్తుతం ఏపీలో ఉన్న నాలుగు పార్టీలు రానున్న ఎన్నికలే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నాయి.. ఈ నేపధ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఏపీ రాజకీయాల్లో పట్టు బిగించడం కోసం కొత్త వ్యూహాలను పన్నుతూ పరిస్దితులను తనకు అనుకూలంగా మార్చుకుంటుందని విశ్లేషకులు అంటున్నారు.. ఈ క్రమంలో ఏపీలో బీజేపీ, జనసేన కూటమిలో ఇకపై జనసేనాని ప్రాధాన్యత తగ్గించే విధంగా పధకం రచించిందని వార్తలు వినిపిస్తున్నాయి..

ఇకపోతే బీజేపీ అధిష్టానం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఏపీ నుండి పురందేశ్వరిని నియమించింది. కాగా ఇప్పటివరకూ పురందేశ్వరి రెండు పార్టీల సమన్వయ సమావేశాలకు హాజరైనా అంటీముట్టనట్టు వ్యవహరించారు. మరోవైపు మెగా ఫ్యామిలీకి వీర విధేయుడుగా పేరు తెచ్చుకున్న వీర్రాజు, ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పదవి చేపట్టిన వెంటనే, చిరంజీవి, పవన్ కల్యాణ్ ల ఇంటికే వెళ్లి కలవడం తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే పురందేశ్వరి పదవికీ, పవన్ కల్యాణ్ కు ప్రత్యక్షంగా ఏ సంబంధం లేకపోయినా.. పరోక్షంగా పవన్ కి, వీర్రాజు కాస్త ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారని మిగతా బీజేపీ నేతలు గుర్రుగానే ఉన్నారట.

ఈ దశలో ఏపీ నుంచి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పురందేశ్వరికి అధిష్టానం అవకాశమిచ్చింది. అంటే ఇకపై ఏపీలో జరిగే బీజేపీ కార్యకలాపాలన్నింటికీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో పురందేశ్వరి హాజరవుతారన్న మాట. కాగా పురందేశ్వరిది జాతీయ స్థాయి పదవి కాబట్టి.. ఆమెను కాదని వీర్రాజు ఎవరినీ పొగడడానికి సాహసించరు. ఒకరకంగా వీర్రాజు ప్రాధాన్యం తగ్గితే, పవన్ ప్రాధాన్యం కూడా తగ్గినట్టే అని అనుకుంటున్నారట. ఈ దశలో పవన్, పురందేశ్వరి మధ్య సయోధ్య కుదురుతుందా లేదా అనేది ముందు ముందు తేలుతుంది.. ఏది ఏమైనా సహజంగానే పవన్ కల్యాణ్ కు ఈ పరిణామం ఇబ్బందిగా మారుతుందని అంచనా వేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. అంతే కాకుండా ఏపీలో పురందేశ్వరి పదవితో ఆమె పలుకుబడి మరింతగా పెరగడంతో పాటు, పొత్తులో భాగస్వామిగా ఉన్న పవన్ ప్రాధాన్యం తగ్గుతుందని అంటున్నారు.. ఇక బీజేపీ సరికొత్త ఎత్తుగడ గమనించి పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి..