తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో వోట్ షేర్ ఇంకా వుందా.?

తెలంగాణలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి వున్న వోట్ షేర్ ఎంత.? అన్న విషయమై భారతీయ జనతా పార్టీ, ఎంపిక చేసిన కొన్ని నియోజకవర్గాల్లో శాంపిల్ సర్వే నిర్వహిస్తోన్నట్లు తెలుస్తోంది. తద్వారా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకోవాలా.? వద్దా.? అన్నదానిపై ఓ నిర్ణయానికి రావొచ్చునన్నది బీజేపీ వ్యూహమట.

ఇప్పటికే సర్వే చాలావరకు పూర్తయ్యిందని అంటున్నారు. గ్రేటర్ హైద్రాబాద్, ఉమ్మడి ఖమ్మం, అలాగే నల్గొండ, ఇంకోపక్క మహబూబ్‌నగర్ తదితర జిల్లాల్లో ఈ సర్వే జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రాథమిక అంచనాల ప్రకారం చూస్తే, టీడీపీకి ఇంకా చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఓటు షేరు మిగిలి వుందని కమలనాథులు గుర్తించారట.

2023 ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే, టీడీపీ ఓట్ షేర్ కూడా ముఖ్యమని బీజేపీ భావిస్తున్నట్లు సమాచారం. అయితే, తమ వల్ల టీడీపీ కూడా లాభపడే అవకాశం వుందనీ, ఒకవేళ టీడీపీకి తమకంటే ఎక్కువ సీట్లు వస్తే, అప్పుడు పరిస్థితి ఏంటి.? అన్న కోణంలో బీజేపీ కొంత మల్లగుల్లాలు పడుతోందిట.

రాజకీయాల్లో శాశ్వత శతృవులు, శాశ్వత మిత్రులూ ఎవరూ వుండరు. నిజానికి, తెలంగాణలో వైసీపీ తమకు గతంలో మద్దతిచ్చిందని బీజేపీకి తెలుసు. కానీ, ఇప్పుడు సీన్ మారింది. వైసీపీ ఓటు షేర్ అంతా, షర్మిల స్థాపించిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ వైపు వెళుతుంది. దాంతో, బీజేపీ.. తెలంగాణలో టీడీపీ వైపు చూస్తున్నట్లు భావించాల్సి వస్తుంది.

మరోపక్క, ఏపీలోనూ టీడీపీతో పొత్తు దిశగా బీజేపీలో చూచాయిగా నిర్ణయం జరిగిపోయినట్లే కనిపిస్తోంది. ‘అబ్బే, మేం చంద్రబాబుని మిత్రుడిగా చూడబోం..’ అని కొందరు బీజేపీ నేతలు పైకి చెప్పొచ్చుగాక. కానీ, బీజేపీ జాతీయ నాయకత్వం లెక్కలు వేరేలా వుంటాయ్. ఇదే విషయమై టీడీపీలో ఇప్పటికే ఓ క్లారిటీ వుంది. బీజేపీతో కలిసి పని చేయబోతున్నామని టీడీపీ నేతలకు చంద్రబాబు ఇప్పటికే సంకేతాలు పంపేశారట.