బీజేపీ దశాబ్దాల తరబడి అయోధ్య రామమందిరం వివాదాన్ని ముందుకు నడిపిస్తూనే ఉంది. ఆనాడు అద్వానీ రథయాత్ర పేరుతో చేసిన ఉత్తరాదిలో మాత్రమే కాదు దక్షిణాదిలో కూడ ప్రభావం చూపింది. అయోధ్య రామమందిరం పేరు చెబితే ఊగిపోయే భక్తులు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉన్నారు. అయితే ఉత్తరాది రాష్ట్రాల్లో పనిచేసినంత బలంగా అది తెలుగు రాష్ట్రాల్లో పనిచేయలేదు. కానీ వాయిద్య తీర్పు తర్వాత, రామమందిరం నిర్మాణం మొదలైన తర్వాత ఆ సెంటిమెంట్ ను ఇక్కడ కూడ పెంచి పోషించాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. రామమందిరం సెంటిమెంట్ అనేది దేశం మొత్తం తిరుగులేని శక్తిగా తయారైంది. మందిరం నిర్మాణం తమ ఘనతే అని చెప్పుకుంటున్నారు బీజేపీ నేతలు. జనంలో కూడ రామమందిరం కల సాకారం కావడానికి బీజేపీయే కారణమనే అభిప్రాయం ఉంది.
దీన్ని దేశవ్యాప్తం చేయడానికి మందిరం నిర్మాణంలో అన్ని రాష్ట్ర ప్రజలను భాగస్వాములను చేసి మందిరంలో వారందరికీ ఒక కనెక్షన్ ఏర్పడేలా చేయాలని బీజేపీ పనిచేస్తోంది. మందిరం నిర్మాణం కోసం న్నిచోట్లా విరాళాలు సేకరిస్తున్నారు. తెలంగాణలో కూడ ఈ సేకరణ జరుగుతోంది. అసలే తెలంగాణలో ఈమధ్య బీజేపీ హవా గట్టిగా కనిపిస్తోంది. భవిష్యత్తులో అధికారం తమదే అంటున్నారు ఆ పార్టీ పెద్దలు. కాబట్టే అయోధ్య సెంటిమెంట్ గట్టిగా పాకిపోతోంది. ఇలాంటి సమయంలోనే తెరాస ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అయోధ్య మందిరానికి విరాళాలు ఇవ్వొద్దని అనడం సంచలనంగా మారింది.
రామమందిరం కడుతామంటున్నారు. మన ఊళ్ళో కట్టుకోలేమా మనం. ఇదొక కొత్త వేషం. యూపీలో రాముడి చూసొస్తామా మనం. మన ఊళ్ళోనే రామమందిరం కట్టుకుంటాం, ఇక్కడే పూజలు చేసుకుంటాం. ఎవరొచ్చినా విరాళాలు ఇవ్వాల్సిన పనిలేదు అన్నారు. దీంతో బీజేపీకి అవకాశం దొరికినట్లయింది. రామమందిరం జోలికొస్తే జాతీయ స్థాయి పార్టీలకే చెమటలు పట్టించినవారు బీజేపీ నాయకులు. అలాంటిడి తెరాసను ఈజీగా వదులుతారని అనుకోలేం. ఇప్పటికే రాజాసింగ్ ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బండి సంజయ్, అరవింద్ సైతం ఈ వ్యవహారాన్ని సులభంగా వదలరు. జాతీయ నాయకత్వం వద్దకు కూడ తీసుకెళ్లే అవకాశం ఉంది. ఎప్పటి నుండో కేసీఆర్ మజ్లీస్ పార్టీతో దోస్తీ చేస్తున్నారని, ఇది హిందువులకు తీరని నష్టమని అంటున్నారు. దానికితోడు ఇదొకటి. అమిత్ షా, నడ్డా లాంటి నేతలు తెలంగాణలో పర్యాటించాల్సి వచ్చినప్పుడు ఈ అంశాన్ని లేవనెత్తకుండా ఉండరు. తెరాస మీద కూడ హిందూ వ్యతిరేక పార్టీ అనే ముద్ర వేసే ప్రయత్నం తప్పకుండా చేస్తారు.