రోజులు మారాయ్.. దేవుడే దిగి వచ్చి తాను దేవుడ్నని చెప్పినా, ‘ఆధారాలు చూపించు’ అని జనం నిలదీసే రోజులివి. అసలు విషయంలోకి వస్తే, హనుమంతుడు ఎక్కడ జన్మించాడన్నది ఇప్పుడు కొందరికి హాట్ టాపిక్. కరోనాతో జనం ప్రాణాలు కోల్పోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో హనుమంతుడి జన్మస్థలంపైన చర్చ ఎందుకు.? అన్న కనీస విజ్ఞత ఎవరికీ వుండడంలేదు.
హనుమంతుడి జన్మస్థలం తిరుమలగిరులేనని ఇటీవల టీటీడీ తేల్చింది. నిజానికి, ముందస్తుగా ఈ అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని బహిరంగ పరిచి, ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తే చర్చించి, ఆ తర్వాత అధికారికంగా ప్రకటన చేయాల్సి వుంది. ఆ కసరత్తులు టీటీడీ చేయలేదన్న విమర్శలు లేకపోలేదు. సరే, హనుమంతుడి జన్మస్థలం తిరుమలగిరులేనని టీటీడీ ప్రకటించాక, దాన్ని తప్పు పట్టడం ఎంతవరకు సబబు.? అన్నది ఇంకో చర్చ. అసలు ఈ సమయంలో ఇది అవసరమా.? అన్నది మరో చర్చ.
ఈ క్రమంలో అడ్డగోలు విమర్శలు, తిట్ల దండకాలు కూడా మొదలయ్యాయి. తగిన ఆధారాలతో ఎవరైనా ముందుకొస్తే, హనుమంతుడి జన్మస్థలం విషయమై పునరాలోచిస్తామని టీటీడీ తాజాగా ప్రకటించడమేంటి.? ఇది సరికొత్త డైటానుమానాలకు తెరలేపుతోంది. శివుడు ఇంకా హిమాలయాల్లో తపస్సు చేస్తుంటాడని నమ్ముతాం మనం. హనుమంతుడు చిరంజీవి గనుక.. ఆయనా జీవించే వున్నాడని నమ్ముతాం.
నిజంగా ఆ దేవుళ్ళు భూమ్మీదకు దిగి వచ్చి, తాము ఫలానా చోట పుట్టామనో, ఫలానా చోట వున్నామనో చెప్పినా, శాస్త్రీ ఆధారాలు అడుగుతామేమో. దేవుడు సర్వాంతర్యామి.
ఇంట్లో కూర్చుని దేవుడ్ని భక్తితో కొలిచేవాడికి ఆ ఇంట్లోనే దేవుడు ప్రత్యక్షమవుతాడనే భావన మనలో చాలామందికి వుంది. అలాంటప్పుడు ఏ దేవుడి జన్మస్థలం ఎక్కడైతే ఏంటి.? ఈ విషయమై రాద్ధాంతం అనవసరం. డిక్లరేషన్ల వల్ల అనవసర రచ్చ తప్ప, హిందూ సమాజానికి అదనంగా ఒరిగేదేమీ లేదు.