Prashant Kishore : ఒక్కో రాష్ట్రానికి ఒక్కోలా ఛార్జ్ చేస్తుంటారు ప్రశాంత్ కిషోర్. ఎన్నికల వ్యూహకర్త అనండీ, రాజకీయ వ్యూహకర్త అనండీ.. పేరేదైనాగానీ, ప్రశాంత్ కిషోర్ అంటే ఓ బ్రాండ్ దేశ రాజకీయాల్లో. తమ పని తీరుతో కాదు, ప్రశాంత్ కిషోర్ సలహాలతో అధికారం దక్కుతుందన్న భ్రమలో చాలామంది రాజకీయ నాయకులు, చాలా రాజకీయ పార్టీలు వుండడం గమనార్హం. అందుకే ప్రశాంత్ కిషోర్ పేరుకి అంత డిమాండ్ వుంది.
తెలంగాణ రాష్ట్ర సమితితో కలిసి పని చేయనున్నారు ప్రశాంత్ కిషోర్ త్వరలో తెలంగాణలో జరిగే అసెంబ్లీ సమావేశాల కోసం. ఆల్రెడీ పని చేస్తున్నారంటూ ఇటీవలే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పష్టమైన ప్రకటన కూడా చేసేశారు. అయితే, ప్రశాంత్ కిషోర్ ఇందుకోసం తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి ఎంత ఫీజుని వసూలు చేస్తున్నారు.?
ఈ విషయమై సోషల్ మీడియాలోనూ, మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ, రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. మొత్తంగా 500 కోట్లకు డీల్ సెట్ అయ్యిందన్నది ఆ చర్చల తాలూకు సారాంశం. ఓ రాజకీయ పార్టీ, అధికారంలోకి వచ్చేందుకు చేస్తోన్న ఈ ఐదొందల కోట్ల ఖర్చుని ఏ లెక్కల్లో వేయాలబ్బా.?
ఎన్నికల వేళ ఓటర్లను కొనేందుకు రాజకీయ పార్టీలు చేసే ఖర్చులు వేరే వుంటాయ్. ఒక్కో అభ్యర్థీ ఎంత ఖర్చు పెట్టాలో (పద్ధతి ప్రకారం) కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ధారిస్తుంది, నిర్ణయిస్తుంది. మరి, ఇదేంటి.? రాజకీయ పార్టీలు ఎంతైనా ఖర్చు చేయొచ్చు గనుక, దానికి లెక్కా పద్దూ వుండక్కర్లేదేమో.!
ఇదిలా వుంటే, 2019 ఎన్నికల్లో తమను గెలిపించిన ప్రశాంత్ కిషోర్‌కి అప్పట్లో వైసీపీ ముందు కుదుర్చుకున్న ఒప్పందం కంటే అదనంగా ‘నజరానా’ చెల్లించిందనే గుసగుసలు వినిపించిన సంగతి తెలిసిందే.