ఆంధ్రప్రదేశ్ అప్పులే వైసీపీ కొంప ముంచేయనున్నాయా.?

చంద్రబాబు హయాంలోనూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పులు చేసింది.. వైఎస్ జగన్ హయాంలోనూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పులు చేస్తోంది. రేప్పొద్దున్న ఇంకో కొత్త ప్రభుత్వం వచ్చినా అప్పులు చేయాల్సిందే. అమ్మడానికి ఏమీ మిగల్లేదు.. అప్పుల మీద అప్పులు చేయకపోతే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మనుగడ సాధించదు. ఈ విషయంలో అయితే అందరికీ ఓ స్పష్టత వుంది.

ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోవడంతో ఏర్పడ్డ కష్టమిది. దానికి తోడు చంద్రబాబు పాలన, ఆపై వైఎస్ జగన్ పాలన.. రాష్ట్రాన్ని మరింతగా అప్పుల ఊబిలోకి నెట్టేశాయి. అప్పట్లో చంద్రబాబు, ఇప్పట్లో వైఎస్ జగన్.. ఇద్దరూ రాష్ట్ర ప్రజలకు నిజాలు చెప్పడంలేదు. కేంద్రాన్ని నిలదీయడంలేదు.. రాష్ట్రానికి కేంద్రం సాయం చేయాల్సిందేనంటూ పట్టుబట్టలేదు, పట్టుబట్టడంలేదు.

మరెలా ఆంధ్రప్రదేశ్ ముందు ముందు మనుగడ సాధించేది.? ఇదైతే ప్రస్తుతానికి ఓ మిలియన్ డాలర్ ప్రశ్నలా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో కూరుకుపోయింది. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డంలేదు. కానీ, రాజకీయ నాయకుల సంపద మాత్రం గణనీయంగా పెరిగింది.

ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడాల్లేవ్.. అప్పట్లో టీడీపీ, ఇప్పుడు వైసీపీ.. ఈ రెండు పార్టీలకు చెందిన నేతల ఆస్తులు 2014కి ముందు ఎలా వున్నాయ్.? ఇప్పుడెలా వున్నాయ్.? అన్నది ఆలోచిస్తే.. ప్రజలకూ ఓ అవగాహన వచ్చేస్తుంటుంది.

టీడీపీ, వైసీపీ నేతలు చాలామంది తెలంగాణలో రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో బిజీగా వున్నారు. వీరిలో కీలకమైన పదవుల్లో వున్నవారూ వుండడం గమనార్హం. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతే, రాష్ట్రాన్ని పరిపాలించిన, పరిపాలిస్తున్న పార్టీలకు చెందిన నేతల ఆర్థిక వనరులు ఎలా పెరిగాయ్.?

ఇదే, ఇప్పుడు ఈ అంశం చుట్టూనే లోతైన చర్చ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో నడుస్తోంది. ఆయా నేతలకు సంబంధించిన వ్యవహారాలపై ప్రజలూ స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో అప్పులు ప్రధానంగా అధికార వైసీపీ కొంప ముంచేయనున్నాయన్నది వచ్చే ఎన్నికల గురించి జరుగుతున్న చర్చల సారాంశం. టీడీపీకి సైతం ఈ కోణంలోనే దెబ్బ గతంలోనే పడిపోయింది.