Bigg Loss For TDP : జనసేనాని పవన్ కళ్యాణ్ జనంలోకి వెళితే టీడీపీకి నష్టమే.!

Bigg Loss For TDP :  వైసీపీ వ్యతిరేక ఓటు చీల్చడానికే జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రయత్నమంటూ అప్పుడే తెలుగు తమ్ముళ్ళు సోషల్ మీడియా వేదికగా రచ్చ షురూ చేశారు.

ఓ వైపు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు జనసేన వైపు వలపు బాణాల్ని సంధిస్తోంటే, ఈ వన్ సైడ్ లవ్‌ని జనసేన పట్టించుకోవడంలేదు.

అయినాగానీ, 2024 ఎన్నికల్లో టీడీపీ – జనసేన కలిసి పోటీ చేస్తాయ్.. అంటూ టీడీపీ శ్రేణులు ప్రచారం చేసుకుంటున్నాయి. ఇంకోపక్క జనసేనాని మీద తీవ్రస్థాయిలో దూషణలకు దిగుతున్నారు తెలుగు తమ్ముళ్ళు.

ఆర్థిక ఇబ్బందులతో ప్రాణాలు కోల్పోయిన కౌలు రైతుల కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున స్వయంగా ఆర్థిక సాయం అందించేందుకు జనసేనాని నడుం బిగించిన విషయం విదితమే. అనంతపురం జిల్లా నుంచి ఈ ‘భరోసా యాత్ర’ చేపట్టనున్నారు పవన్ కళ్యాణ్.

రాష్ట్రమంతా మెరుపు పర్యటనలు చేయడానికి జనసేనాని ఈ మార్గం ఎంచుకున్నారు.

నిజానికి, ఈ టూర్ పట్ల ఆందోళన చెందాల్సింది అధికార వైసీపీ. ఆ పార్టీ నుంచి పలువురు మంత్రులు జనసేనాని మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేసేశారనుకోండి.. అది వేరే విషయం.

అయితే, అంతకు మించి.. తెలుగుదేశం పార్టీ, జనసేన మీద విషం చిమ్ముతోంది. జనసేనాని ఎన్నికలకు రెండేళ్ళ ముందు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడమేంటన్నది టీడీపీ నేతలు కొందరు సంధిస్తున్న ప్రశ్న.

‘జనసేన మీద కూడా అనుమానాలు కలుగుతున్నాయి. వైసీపీకి మేలు చేయడానికే జనసేనాని ప్రయత్నిస్తున్నారా.? వైసీపీ నుంచి పవన్ ప్యాకేజీ తీసుకున్నారా..’ అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు టీడీపీ నేతలు కొందరు.. ఇది జనసేన నేతలకు ఒళ్ళు మండేలా చేస్తోంది.

టీడీపీ అయినా, వైసీపీ అయినా.. మరో పార్టీ అయినా.. ఎవరి పల్లకీ మోయడానికి తాము సిద్ధంగా లేమన్నది జనసేన వాదన.

వైసీపీ ఓటు బ్యాంకు చీలితో నష్టపోయేది తామేనంటూ గింజుకుంటున్న టీడీపీ, ఆ కారణంగానే జనసేన మీద విమర్శలు షురూ చేసినట్లు కనిపిస్తోంది. మరి, వన్ సైడ్ లవ్ చేస్తోన్న టీడీపీ అధినేత మాటేమిటి.?