ఇప్పటికే టీడీపీ కోటకు బీటలు మొదలయ్యాయి. వరుస అరెస్ట్ లు….ఇతర కారణాలుగా పార్టీలో సీనియర్ల నుంచి జూనియర్ల వరకూ ఎవరికి వారు సేఫ్ జోన్ చూసుకుంటున్నారు. బీజేపీనో..వైకాపా పార్టీ తీర్ధాలకు రెడీ అవుతున్నారు. ఓ వైపు చంద్రబాబు సీనియర్లని కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఫలించడం లేదన్నది ఇన్ సైడ్ టాక్. విశాఖ నుంచి ఉత్తరం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైకాపాలోకి చేరితో ఆయనతో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు జంప్ ఖాయమనే బలమైన ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా కడప గడపలోనూ టీడీపీకి తూట్లు పడుతున్నట్లే తెలుస్తోంది.
ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత వరదరాజులు రెడ్డి కూడా సైకిల్ దిగడానికి రెడీ అవుతున్నారుట. కడప జిల్లా రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో ఆయనెంతో సీనియర్. ప్రొద్దుటూరు నుంచి 1989 నుంచి 2004 వరకూ వరుస విజయాలు సాధించారు. అయితే 2004లో వైఎస్సార్ తో విబేధాలు తలెత్తాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో 2009 లో ఓడిపోయారు. ఆ తర్వాత 2014 ఎన్నికల సమయంలో టీడీపీలో చేరారు. పోటీ చేసి ఓడిపోయారు. ఇక 2019 లో టీడీపీ సీటు ఇవ్వలేదు. వాస్తవానికి ఆ పార్టీతో వరదరాజులు రెడ్డికి తొలి నుంచి పొసిగేది కాదు. చివరికి సీటు ఇప్పించిన సీఎం రమేష్ కుమార్ తోనే ఆయనకు మనస్పర్ధలొచ్చాయి.
ఇప్పుడా గ్యాప్ తో పాటు, స్థానిక ఎన్నికల్లో కడప మొత్తం క్లీన్ స్వీప్ చేయాల్సిందేనని వైకాపా అదిష్టానం అదేశాల మేరకు సీనియర్లు అందర్నీ పార్టీలో చేర్చుకునే కార్యక్రమం మొదలైందని తెలిసింది. ముఖ్యంగా టీడీపీ టార్గెట్ గా పావులు కదుపుతోంది. ఇక ప్రొద్దుటూరు నియోజక వర్గంలో పట్టున్న నాయకుడిగా వరదరాజులు ప్రత్యేకం. ఈ నేపథ్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి చర్యలు ప్రారంభించినట్లు తెలిసింది. ఇప్పటికే లింగారెడ్డిని చంద్రబాబు తప్పించారు. ఇప్పుడు వరదరాజులు కూడా దూరమైతే టీడీపీ ప్రొద్దుటూరు లో శూన్యమనే చెప్పాలి. ప్రొద్దుటూరు లో వైసీపీ గెలుపు నల్లేరు మీద నడకే అవుతుంది. తాత్కలికంగా ప్రవీణ్ రెడ్డికి- చంద్రబాబు బాధ్యతలు అప్పగించినా వైసీపీని ఎదుర్కోవడం చాలా కష్టమైన పనే.