వైఎస్ జగన్ టీడీపీలో పదవుల్లో ఉన్న ఎమ్మెల్యేలనే కాదు, పదవిలో లేని పెద్ద నేతలని కూడ తనవైపుకు తిప్పుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొందరు బడా లీడర్లు వైసీపీ కండువా కప్పుకోగా తాజాగా మరొక బిగ్ షాట్ మాగంటి వెంకటేశ్వరరావు అలియాస్ మాగంటి బాబు కూడ పార్టీని వీడనున్నారనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. పశ్చిమ గోదావరిలో మాగంటి బాబు బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న నేత. ఆయన కుటుంబం ఎన్నో తరాల నుండి రాజకీయాల్లో ఉంది. ఆయా ముందు తరం వరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగగా బాబు మాత్రం 2009లో టీడీపీలో చేరారు.
1998లో ఏలూరు లోక్ సభ స్థానం నుండి గెలుపొందిన ఆయన టీడీపీలో చేరాక 2009 ఎన్నికల్లో ఓడారు. మళ్ళీ 2014లో అదే ఏలూరు నుండి ఎంపీగా ఎన్నికయ్యారు. చంద్రబాబు నాయుడు ఈయనకు మొదటి నుండి మంచి ప్రాధాన్యం ఇచ్చారు. కానీ 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోవడంతో మాగంటి బాబు హవా కొంచెం తగ్గింది. స్వతహాగా మాగంటి బాబు పెద్ద వ్యాపారస్తుడు. గోదావరి జల్లాలోని ఆర్థికంగా బలమైన రాజకీయ నాయకుల్లో ఈయన కూడ ఒకరు. అందుకే పార్టీలో ఆయనకు మంచి వెయిట్ ఉండేది.
కానీ ఎన్నికల్లో ఓడిపోయాక పార్టీకి, ఆయనకు ఇబ్బందులు మొదలయ్యాయి. రాజకీయాలు సంగతి ఎలా ఉన్నా వ్యాపారాల విషయంలో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇదే అదునుగా భావించిన వైసీపీ కీలక నేతలు కొందరు ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారట. అన్నిరకాల సౌకర్యాలు ఉంటాయి వచ్చేయండి అని సందేశం ఇచ్చారట. బాబు కూడ టీడీపీ ఇప్పుడప్పుడే కోలుకునే లేదు, ఇలాగే ఉంటే రాజకీయంగానే కాక వ్యాపారాల పరంగా, ఆర్థికంగా దెబ్బతినాల్సి వస్తుందని భావించి స్వీయ భద్రత చూసుకుని వైసీపీలోకి జంప్ అయ్యే ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు చెబుతున్నారు. ఇదే గనుక నిజమైతే టీడీపీ నుండి పెద్ద తిమింగిలం మిస్సైనట్టే.