వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజుకి షాక్ తగిలింది. ప్రభుత్వ ప్రతిష్టతను దెబ్బ తీసేందుకు యత్నించారనీ, సమాజంలో అలజడి రేపేందుకు ప్రయత్నించారనీ, కులాలు మతాల మధ్య ఘర్షణ వాతావరణాన్ని రగిల్చేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారనీ రఘురామకృష్ణరాజుపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది ఏపీసీఐడీ. నిన్ననే హైద్రాబాద్ లో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు ఏపీ సీఐడీ పోలీసులు. అనంతరం ఆయన్ని గుంటూరుకి తరలించారు. అయితే, నిన్న రాత్రే హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు రఘురామ తరఫు లాయర్. విచారణ చేపట్టిన న్యాయస్థానం రఘురామకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. సెషన్స్ కోర్టులోనే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సిందిగా హైకోర్టు సూచించడం గమనార్హం.
ఇంకోపక్క మరికొద్ది సేపట్లోనే ఏపీ సీఐడీ, రఘురామకృష్ణరాజుని కోర్టులో హాజరుపరచనుంది. విచారణ అనంతరం కోర్టు, రఘురామకు బెయిల్ మంజూరు చేస్తుందా.? రిమాండ్ విధిస్తుందా.? అన్నదానిపై స్పష్టత రానుంది. రఘురామపై దేశద్రోహం ఆరోపణల నేపథ్యంలో సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన దరిమిలా, బెయిల్ రావడం అంత సులభం కాదని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోపక్క, కరోనా ప్రభావం రాష్ట్రంలో తీవ్రంగా వుండడం.. రఘురామ ఇటీవల బైపాస్ సర్జరీ చేయించుకోవడం.. ఈ అంశాల్ని న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంటుందనీ, ఆయనకు వెసులుబాటు కల్పిస్తుందనీ రఘురామ మద్దతుదారులు భావిస్తున్నారు. ఏమో, ఏం జరుగుతుందోగానీ.. నోటి దురదకి తగిన మూల్యం రఘురామ చెల్లించుకున్నారన్న వాదన వైసీపీ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది.