ఏపీలో ఉన్న విశాఖ స్టీల్‌ను ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరిస్తామని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. ఏపీ ప్రభుత్వానికి ఈ వ్యవహారంతో సంబంధం లేదని పార్లమెంట్ సాక్షిగా ప్రకటించింది కేంద్రం. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో రాష్ట్రానికి ఈక్విటీ షేర్ లేదని , వందశాతం పెట్టుబడులను ఉపసంహరిస్తామని తేల్చిచెప్పింది. మెరుగైన ఉత్పాదకత కోసమే ప్రైవేటీకరిస్టున్నట్టు ఏపీ ఎంపీ సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై భారీగా నిరసనలు వెల్లువెత్తినప్పటికి కేంద్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ అంశంపై ఇప్పటికే సాక్షాత్తూ ప్రధాని మోదీకూడా తేల్చి చెప్పేసిన సంగతి తెలిసిందే. స్టీల్‌ప్లాంట్ అమ్మకంపై జగన్ ప్రభుత్వంతో ఇప్పటికే సంప్రదింపులు జరిపామని ఆమె పేర్కొన్నారు. అవసరమైనప్పుడు మద్దతు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరామన్నారు.
ఇక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఇప్పటికే ఏపీలో ఆందోళనలు ఉధృతమయ్యాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని అన్ని పార్టీలు డిమాండ్ చేశాయి. విశాఖలో చేస్తున్న ఆందోళనకు మద్దతు ప్రకటించాయి. ఏపీ, తెలంగాణ మావోయిస్టులు కూడా ఇప్పటికే సంఘీభావం ప్రకటించారు. భాజపా మినహా అన్ని రాజకీయ పార్టీలు, వివిధ ప్రజా సంఘాలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నాయి. ఉక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఇటీవల చేపట్టిన రాష్ట్ర బంద్ విజయవంతమైంది. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి లోక్‌సభలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానం చర్చనీయాంశం కానుంది. స్టీల్ ప్లాంట్‌పై తాజాగా కేంద్రప్రభుత్వం చేసిన ప్రకటన రాజకీయ చర్చకు దారితీస్తోంది.