పాపం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు.. తనను ఎంపీని చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తుని రద్దు చేయించాలనుకున్నారు.. అంతేనా, తనకు ఎంపీ టిక్కెట్ ఇచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయించడానికి నానా కష్టాలూ పడ్డారు. వైసీపీకి పెద్ద తలనొప్పిగా మారిన రఘురామకృష్ణరాజు ఎపిసోడ్‌లో అధికార వైసీపీ మరోమారు పై చేయి సాధించినట్లయ్యింది. విజయసాయిరెడ్డి, వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ రఘురామ, సీబీఐ కోర్టుని ఆశ్రయించిన విషయం విదితమే. రఘురామ పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం, ఆ పిటిషన్లను కొట్టివేసింది. అంతకు ముందు రఘురామ, సాక్షి మీడియాలో వచ్చిన ఓ వార్త ఆధారంగా హైకోర్టును ఆశ్రయిస్తూ, సీబీఐ కోర్టు తీర్పు వెల్లడించకుండా చేయాలని కోరారు. కేసు విచారణను మరో బెంచ్‌కి మార్చాలని కూడా కోరారు. హైకోర్టు మాత్రం రఘురామకు ఊరటనివ్వలేదు.
సీబీఐ కోర్టులో రఘురామకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యే స్థాయిలో ఎదురు దెబ్బ తగిలింది. తాము బెయిల్ షరతుల్ని ఉల్లంఘించలేదనీ, రఘురామ రాజకీయ కోణంలోనే బెయిల్ రద్దు కోసం పిటిషన్ దాఖలు చేశారనీ వైఎస్ జగన్, విజయసాయిరెడ్డి చేసిన వాదనలతో సీబీఐ కోర్టు ఏకీభవించినట్లే కనిపిస్తోంది. కాగా, సాక్షి మీడియాలో సీబీఐ కోర్టు తీర్పుపై ముందే వచ్చిన వార్తతో తనకు ఈ తీర్పు పట్ల ఆసక్తి లేకుండా పోయిందనీ, అయినా న్యాయస్థానాల పట్ల తనకున్న గౌరవం తగ్గిపోదనీ, హైకోర్టును ఆశ్రయిస్తాననీ.. అక్కడా న్యాయం జరగకపోతే, సుప్రీంకోర్టుకి వెళతాననీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించడం గమనార్హం. రెండేళ్ళుగా ప్రత్యక్ష విచారణకు హాజరు కాకుండా బెయిల్ షరతుల్ని జగన్, విజయసాయిరెడ్డి ఉల్లంఘిస్తున్నారని రఘురామ ఆరోపిస్తున్నారు. అయితే, న్యాయస్థానాల నుంచి అనుమతులు పొందుతూనే, ప్రత్యక్ష విచారణకు హాజరవడంలేదు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ విషయాన్ని రఘురామ కూడా అంగీకరిస్తూనే.. బెయిల్ షరతులు ఉల్లంఘిస్తున్నారని ఆరోపించడంలో అర్థమేమిటో.!