Polavaram : వైఎస్ రాజశేఖర్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పోలవరం ప్రాజెక్టుకి పట్టిన రాజకీయ గ్రహణం ఇంకా వీడటంలేదు. వైఎస్సార్ మరణంతో పోలవరం ప్రాజెక్టు పరిస్థితి అయోమయంలో పడితే, ఉమ్మడి తెలుగు రాష్ట్రం విడిపోవడంతో పోలవరం ప్రాజెక్టుకి జాతీయ హోదా దక్కి.. ప్రాజెక్టు పనులు వేగం పుంజుకున్నాయి.
అయితే, 2018 నాటికి పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయాల్సి వుండగా, టీడీపీ – బీజేపీల రాజకీయ నాటకానికి పోలవరం ప్రాజెక్టు భవిష్యత్తు ప్రశ్నార్థకమయ్యింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం ప్రాజెక్టు వ్యయం తగ్గించేందుకు ప్రయత్నించినా, కేంద్రం సహాయ సహకారాలు సరైన రీతిలో అందించడంలేదు.
2021 జూన్ నాటికి పూర్తవ్వాల్సిన ప్రాజెక్టు, 2021 డిసెంబర్ నాటికి కూడా ఓ కొలిక్కి రాలేదు. పోనీ, తాజా డెడ్ లైన్ ఏప్రిల్ 2022 నాటికి అయినా పూర్తవుతుందా.? అంటే, నిర్ణీత సమయంలో పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశమే లేదని కేంద్రం పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో స్పష్టం చేసేసింది.
అంటే, పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసే ఉద్దేశ్యం కేంద్రానికి లేదన్నమాట. సాంకేతిక కారణాలు అలాగే, కరోనా పాండమిక్ అంశాల్ని ‘సాకు’గా చూపుతోంది కేంద్రం. ఇదెంతమాత్రం హర్షణీయం కాదన్నది నిర్వివాదాంశం.
పోలవరం ప్రాజెక్టు, ఆంధ్రప్రదేశ్ జీవనాడి. అలాంటి ప్రాజెక్టు విషయంలో కేంద్రం ‘సవతి తల్లి’ ప్రేమ చూపడం అత్యంత బాధాకరం. మరి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముందున్న ఆప్షన్స్ ఏంటి.? కేంద్రం నిధులు ఇవ్వకపోయినా, ప్రాజెక్టు పనుల విషయమై ముందుకెళతారా.? లేదంటే, చేతులెత్తేస్తారా.?
రాష్ట్ర ప్రభుత్వం తొలుత ఖర్చు చేస్తే, అలా ఖర్చు చేసిన ప్రతి పైసా కేంద్రమే రీ-ఎంబర్స్‌మెంట్ చేస్తుందని మోడీ సర్కార్ పదే పదే చెబుతోంది. కానీ, బిల్లుల క్లియరెన్స్ మాత్రం చేయడంలేదు. అదే పోలవరం ప్రాజెక్టుకి శాపంగా మారుతోంది.