Bheemla Nayak : ఇంతకీ ‘భీమ్లానాయక్’ వస్తుందా.? రాదా.?

Bheemla Nayak : ‘మనల్ని ఎవడ్రా ఆపేది.?’ అంటూ ఆ మధ్య ఓ సందర్భంలో జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు, ఆంధ్రప్రదేశ్‌లో కొందరు ప్రభుత్వ పెద్దలకు తీవ్ర ఆగ్రహం కలిగించాయనే ప్రచారం జరిగిన విషయం విదితమే.

సంక్రాంతి బరిలో నిలవాల్సిన ‘భీమ్లానాయక్’, ‘ఆర్ఆర్ఆర్’ అలాగే ‘రాధేశ్యామ్’ నిర్మాతల విజ్ఞప్తితో కాస్త వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఫిబ్రవరి 25న సినిమా విడుదల కావాల్సి వుండగా, ‘విడుదల ఎప్పుడు.?’ అన్న ప్రశ్నకు చిత్ర నిర్మాత ఇటీవల మాట్లాడుతూ, ‘ఆ ప్రశ్న మీరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అడగాలి. నైట్ కర్ఫ్యూ, 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధన ఎత్తివేస్తే, సినిమా విడుదల చేయడానికి సిద్ధం’ అని చెప్పారు.

మనల్ని ఎవరు ఆపేది.?’ అనడానికీ, ‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అనుమతి వస్తే..’ అనడానికీ చాలా తేడా వుంది. సరే, సినిమాపై రాజకీయాలు.. రాజకీయాలపై సినీ విమర్శలు.. అది వేరే చర్చ.
‘మీరైతే ధైర్యంగా సినిమా విడుదల చేసెయ్యండి.. మిగతాది మేం చూసుకుంటాం..’ అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు, ‘భీమ్లానాయక్’ చిత్ర బృందానికి భరోసా ఇస్తున్నారు. కానీ, కరోనా కారణంగా ‘భీమ్లానాయక్’ సినిమా కూడా కొంత ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్న మాట వాస్తవం.. అన్నది సినీ వర్గాల్లో వినిపిస్తోన్న వాదన.

ఈ నేపథ్యంలో సినిమా సరైన సమయంలో విడుదలైతేనే ఫలితం కొంత సానుకూలంగా వుంటుంది. లేదంటే అంతే సంగతులు. అందుకే, ‘భీమ్లానాయక్’ నిర్మాత ఆచి తూచి వ్యవహరించాల్సి వస్తోంది. ఇంతకీ, ఈ నెలాఖరుకి ‘భీమ్లానాయక్’ వస్తుందా.? రావడానికి అవకాశాలైతే చాలా చాలా తక్కువగా వున్నాయ్.