దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. నవంబర్ 10న ఫలితాలు విడుదల కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్శించిన ఈ ఉపఎన్నిక బెట్టంగ్ రాయుళ్లను కూడా బాగా ఆకర్శించింది. ఎన్నికల్లో గెలుపు ఓటములపై గతంలో ఎన్నడూ లేని విధంగా బెట్టింగ్ లు కడుతున్నారు. ఉప ఎన్నిక జరిగిన తీరుతెన్నులు తెలుసుకొని మరీ రంగంలోకి దిగుతున్నారు. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్న తీరుగా పోటీ నడిచిందన్న అంచనాకు వచ్చిన బెట్టింగ్ రాయుళ్లు… ఇప్పుడు ఈరెండు పార్టీలపై బెట్టింగ్ కడుతున్నారు. గెలుపు, మెజార్టీ ఇలా అన్నింటిపై పందాలు కాస్తున్నారు.
కొందరు టిఆర్ఎస్ గెలుపు మెజార్టీపై బెట్టింగ్ కాస్తే మరి కొందరు అతి తక్కువ మెజార్టీతో బిజేపి గెలుస్తుందని పందాలు కాస్తున్నారు. అధికార టిఆర్ఎస్ పార్టీ గెలుపుపై ఖాయమనే నిర్ణయానికి వచ్చిన వాళ్లు మెజార్టీ పై బెట్టింగ్ కాస్తున్నారు. డబ్బులపై ఆశ ఉన్న వాళ్లు బీజేపీపై బెట్టింగ్ కాసి రిస్క్ తీసుకుంటున్నారు. బీజేపీ గెలిస్తే రూపాయికి …మూడు రుపాయలు ఇస్తామని బుకీలు ఆఫర్ ఇవ్వడంతో చాలా మంది బీజేపీ పై బెట్టింగ్ కడుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి కి కనీసం డిపాజిట్ అయినా దక్కుతుందా లేదా అనే దానిపై కూడా బెట్టింగ్ జరుగుతోంది.
భీమవరం కేంద్రంగా నడుస్తున్న బెట్టింగ్ వ్యవహరాలు తెలంగాణపై దృష్టి సారించడంతో పోలీలుసు కూడా అలెర్ట్ అయ్యారు. బూకీల కూపీ లాగేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి వరకు ఎవరూ పట్టుబడకపోయిన పోలీసులు మాత్రం ఈ దిశగా సీరియాస్ గానే దృష్టి పెట్టారు.