కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ కి చేధు అనుభవం ఎదురైంది. అధికారుల తీరుతో సాక్షాత్తు సీఎల్పీ ఫ్లోర్ లీడర్ భట్టి విక్రమార్కకు అవమానం జరిగింది. వివరాల్లోకి వెళ్తే…ఖమ్మం జిల్లా మధిరలో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఈ మధ్యే నిర్మించారు. స్థానిక ఎమ్మెల్యే భట్టి విక్రమార్కను ప్రోటోకాల్ కు ఇబ్బంది రాకుండా ప్రారంభోత్సవానికి అధికారులు ఆహ్వానించారు.
ఉదయం 11 గంటలకు సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడానికి స్థానిక ఎమ్మెల్యే భట్టివిక్రమార్కను ఆహ్వానించారు ఖమ్మం జిల్లా అధికారులు. 10 గంటలకు ఎమ్మెల్యే పి.ఎ మార్కెటింగ్ శాఖ సెక్రెటరీ కి ఫోన్ చేసి ఆరా తీయగా… కార్యక్రమం కాస్త ఆలస్యం అవుతోందని… ఉదయం 11:30 గంటలకు రావాలని సూచించారు. అయితే మన దగ్గర ప్రభుత్వ కార్యక్రమాలు ఏవీ చెప్పిన టైంకు కావు కాబట్టి…ఓ పదిహేను నిమిషాలు ఆలస్యంగా ఉదయం 11:45 నిముషాలకు మార్కెట్ యార్డ్ కు చేరుకున్నారు సీఎల్పీలీడర్ భట్టివిక్రమార్క. అయితే ఆపాటికే ప్రారంభోత్సవం అయిపోయిందని తెలుసుకొని ఖంగుతిన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ తో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభించినట్లు సీసీఐ, మార్కెటింగ్ శాఖ అధికారులు భట్టి విక్రమార్కకు తెలిపారు. తనను పిలిస్తేనే వచ్చానని… తీరా వచ్చిన తర్వాత వేరొకరితో రిబ్బన్ కట్ చేయించామని చెప్తే ఎలా అని అధికారులపై మండిపడ్డారు భట్టివిక్రమార్క. ప్రారంబోత్సవానికి తనను పిలిచి హడావుడిగా వేరే వారితో ఎలా కానిచ్చేస్తారని అధికారులను నిలదీశారు.
దీంతో ఏదో సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు ఖమ్మం జిల్లా సీసీఐ అధికారులు. ఎంతకీ శాంతించని భట్టి విక్రమార్క స్థానిక అధికారుల తీరుపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. సీఎల్పీలీడర్ నే ఖాతరు చేయని అధికారుల వైనంపై మండిపోతున్నారు మధిర కాంగ్రెస్ కార్యకర్తలు. ఇప్పుడు లోకల్ గా ఇదే టాపిక్ నడుస్తోంది.