ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి జైలుకు వెళ్ళారు. రెడ్ హ్యాండెడ్‌గా ఆయన తెలంగాణ ఏసీబీకి దొరికిపోయారు అప్పట్లో. అప్పుడాయన టీడీపీ నేత.! అదే రేవంత్ రెడ్డి, ప్రస్తుతం తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు. అదృష్టం కలిసొస్తే ఆయనే తెలంగాణ ముఖ్యమంత్రి కాబోతున్నారు కూడా.!
కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి పదవి కోసం డజను మందికి పైగా పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. ఇలా లిస్టు చాలా పెద్దదే వుంది.. ముఖ్యమంత్రి పదవికి సంబంధించి.
నానా రకాల రాజకీయ పరమైన ఇబ్బందుల్నీ ఎదుర్కొని, చివరికి రేవంత్ రెడ్డి తాను గెలిచారు, కాంగ్రెస్ పార్టీనీ గెలిపించారు. ఇప్పుడాయన ముఖ్యమంత్రి అయితే.! ఏపీలో వైఎస్ జగన్, తెలంగాణలో రేవంత్.. ఇదీ అందరూ అనుకునేది.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకొచ్చి వైఎస్సార్సీపీని స్థాపించారు. రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరారు. విషయం అది కాదు. అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్, ఓటుకు నోటు కేసులో రేవంత్.. ఇదీ ఈక్వేషన్.
వైఎస్ జగన్ రాజకీయ వేధింపులకు గురయ్యారు.. రేవంత్ రెడ్డి అడ్డంగా బుక్కయిపోయారు.. ఇదీ వాస్తవమని అనేవారూ లేకపోలేదు. ఎవరి గోల వారిది. కానీ, వైఎస్ జగన్ తరహాలోనే రేవంత్ రెడ్డి చాలా చాలా అవమానాలు ఎదుర్కొన్నారు. కానీ, నిలదొక్కుకున్నారు.
అయితే, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ రాజకీయాలు తట్టుకుని, తెలంగాణలో ఎలా నిలదొక్కుకుంటాడనేది ఇక ముందు చూడాల్సిన అసలు సిసలు సినిమా. గతంలో సొంత నియోజకవర్గం కొడంగల్‌లో రేవంత్ రెడ్డి ఓడిపోయారు. ఇప్పుడు అక్కడే గెలిచారాయన. ప్రస్తుతం కాంగ్రెస్ ఎంపీగానూ వున్నారు రేవంత్ రెడ్డి.
రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా, ముఖ్యమంత్రి అవగానే కేసీయార్‌ని రేవంత్ రెడ్డి అరెస్టు చేయిస్తారా.? వేచి చూడాల్సిందే.