బార్లీ నీళ్లు తాగితే లాభాలేంటి..? అధిక బరువు తగ్గడానికి ఉపయోగపడుతుందా..?

ఒంట్లో వేడి చేసిన వారు, ఆరోగ్యం కోసం శ్రద్ధ వహించేవారు గతంలో బార్లీ గింజలు కాచి తాగేవారు. శరీరానికి ఎంతో చలవ చేస్తుంది. వైద్యులే కాదు.. పెద్దలు కూడా చెప్పే మాట. అయితే.. రోజులు మారి అనేక కొత్త పద్ధతులు రావడంతో బార్లీ తాగడం తక్కువైంది. బార్లీని అతిగా తీసుకోకూడదు.. అనేవారూ ఉన్నారు. అయితే.. బార్లీ తాగితే అధిక బరువుతో బాధపడేవారు ఆ సమస్య నుంచి బయటపడొచ్చని అంటున్నారు. అయితే.. ముందు డాక్టర్ల సలహా తీసుకోవడం ఉత్తమమనే విషయం మరచిపోవద్దు.

నేడు జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ ఆహారం ఎక్కువై ఊబకాయంతో బాధపడుతున్నారు. రోజువారీ జీవనశైలిలో కూడా వస్తున్న మార్పులే ఇందుకు నిదర్శనం. టైమ్ తినకపోవడం, వ్యాయామానికి దూరంగా ఉండటం కూడా శరీరానికి శ్రమ లేకపోవడం.. ఇవన్నీ అధిక బరువుకు కారణాలే. దీంతో బరువు తగ్గేందుకు చేయని ప్రయత్నాలు ఉండటం లేదు. బరువు పెరిగిన తర్వాత కంటే ముందుగానే బరువు పెరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. ఇందుకు బార్లీ ఎంతో మేలు చేస్తుంది.

బార్లీ గింజలను మెత్తగా ఉడికించాలి. వాటిని వడగట్టి అర గ్లాసుడు ఆరెంజ్ జ్యూస్, నిమ్మరసంలో  కలిపి తీసుకోవాలి. దీనివల్ల బరువు తగ్గే అవకాశం ఉంది. పచ్చి బఠాణీలు, బార్లీ గింజలను ప్రతిరోజూ ఆహారంలో తీసుకోవడంలో కూడా బరువు తగ్గే అవకాశం ఉంది. బార్లీలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. బార్లీ నీళ్లు తీసుకోవడం ద్వారా పేగుల్లో ఉండే మలినాలు పోతాయి. క్యాన్సర్ ను నియంత్రించే శక్తి బార్లీకి ఉంది. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలన్నా బార్లీ ఎంతో శ్రేయస్కరం. కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగించే శక్తి బార్లీకి ఉంది. బీపీ కూడా కంట్రోల్ లో ఉంటుంది.

చర్మ సమస్యలను బార్లీ తగ్గిస్తుంది. చర్మం కాంతివంతంగా ఉండేలా చేస్తుంది. జ్వరంతో ఉన్నప్పుడు శక్తి కోసం బార్లీని తీసుకోవచ్చు. గ్లూకోజ్ లో కలిపి కూడా తీసుకుంటే శక్తి వస్తుంది. వృద్ధాప్య ఛాయలు తగ్గించే యాంటీ ఆక్సిడెంట్లు బార్లీలో ఉంది. ఇన్ని పోషకాలు ఉన్న బార్లీని నేటి జనరేషన్లో వాడకం తగ్గించారు. ఇంట్లో పెద్దలు చెప్తే బలవంతంగా తాగేవారే ఎక్కువ. టేస్టీగా ఉండకపోవడం కూడా ఇందుకు కారణం. కానీ.. ఆరోగ్యపరంగా బార్లీ నీళ్లు చేసే మేలు చాలా ఎక్కువ.