ఏపీ రాజకీయాల్లో గంటా శ్రీనివాస్ కు ప్రత్యేక స్థానం ఉంది. అధికారంలో ఎవరున్నా వారితో పనులు చేయించుకునే సామర్థ్యం ఉన్న నేతగా ఆయనకు పేరుంది. వైసీపీలోకి మారుతున్నారని చాలా కాలంగా వార్తలు వస్తున్నా ఎందుకో ఆ దిశగా అడుగులు పడడం లేదు. ఇంతలో ఆయనకు మరో సమస్య వచ్చి పడింది. ఈయన ఆస్తులను వేలం వేస్తున్నట్లు బ్యాంకులు ప్రకటించాయి. గతంలో గంటా శ్రీనివాస్ రావు ప్రత్యూష గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌కు డైరెక్టర్‌గా పనిచేశారు. అప్పుడు కంపెనీ తరపున తీసుకున్న బకాయిలను చెల్లించకపోవడంతో ఆస్థులను వేలం వేస్తున్నట్లు బ్యాంకులు ప్రకటించాయి.
ప్రత్యూష గ్రూప్ ఆఫ్ కంపెనీస్..ఇండియన్ బ్యాంకు నుంచి 141.68 కోట్ల రూపాయలు అప్పు తీసుకుంది. వడ్డీతో కలిపి అది ఇప్పుడు 248 కోట్లకు చేరింది. నోటీసులకు స్పందించకపోవడంతో ఈ నెల 25న మధ్యాహ్నం ఆస్తులను వేలం వేస్తున్నారు. ప్రత్యూష గ్రూప్ కు చెందిన ఆస్తులను ఈపాటికే వేళం కోసం అటాచ్ చేసినట్లు సమాచారం. విశాఖపట్నంలో ఆఫీస్ బిల్డింగ్ తో పాటు చినగడలి, గాజువాక, రుషికొండ, ఆనందాపురం, మధురవాడ, బాలయ్య శాస్త్రి లే అవుట్, కాకినాడ, అనకాపల్లి, తమిళనాడులో ఈ గ్రూప్ కు ఆస్తులున్నాయి. మెటల్ స్క్రాప్ ట్రేడ్ కార్పోరేషన్ ఈ వేలం నిర్వహించబోతోంది.
అయితే తాను ప్రత్యూష గ్రూప్ నుంచి ఎప్పుడో తప్పుకున్నానని, ఈ వేలంలో తనకు చెందిన కేవలం ఒకే ఒక్క ఆస్తి మాత్రమే ఉందని తేల్చి చెప్పారు గంట శ్రీనివాస్ రావు. మిగతావన్నీ ప్రత్యూష గ్రూప్ కు చెందిన అస్తులే అని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఉద్దేశపూర్వకంగా రుణాల ఎగవేత కేసులు పెరిగిపోతుండడంతో బ్యాంకులు ఈ అంశంపై కఠినంగా వ్యవహరిస్తున్నాయి.