TDP : అధికారం ఎక్కడుంటే అక్కడుంటారు గంటా శ్రీనివాసరావు.. అన్నది చాలాకాలంగా తెలుగునాట రాజకీయాల్లో బలంగా నాటుకుపోయింది. కానీ, ఈసారెందుకో గంటా శ్రీనివాసరావు రాజకీయం అనుకున్న రీతిలో నడవడంలేదు. టీడీపీ నుంచి కనాకష్టంగా 2019 ఎన్నికల్లో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు గెలిచారు. అయితే, ఆ తర్వాత ఆయన వైసీపీ వైపు చూశారు, బీజేపీతో కూడా సన్నిహితంగా మెలిగారు.
ఇంతకీ, గంటా శ్రీనివాసరావు ఏ పార్టీలో వున్నట్టు.? అది ఆయనకైనా తెలుసో లేదో.! గంటా, టీడీపీకి దూరంగా వుంటున్నారు. ఆయన్ని బుజ్జగించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ఏ ప్రయత్నమూ ఫలించడంలేదు. అలాగని గంటా ఏదన్నా ఇతర పార్టీలో చేరారా.? అంటే అదీ లేదు.
వచ్చే ఎన్నికలకు సంబంధించి ముందస్తు సన్నాహాల్లో భాగంగా పార్టీ ముఖ్య నేతలతో, అందునా నియోజకవర్గాల ఇన్‌ఛార్జిలతో టీడీపీ అధినేత చంద్రబాబు వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గంటా శ్రీనివాసరావుకి ప్రత్యేకంగా పిలుపు వెళ్ళింది. కానీ, ఆయన దాన్ని లైట్ తీసుకున్నారు.
ప్రత్యేక కారణాల దృష్ట్యా గంటా శ్రీనివాసరావు, చంద్రబాబుతో భేటీ కాలేకపోయారనీ, తర్వాత వీలు చూసుకుని కలుస్తారనీ టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. కానీ, గంటా సన్నిహితులు మాత్రం, చంద్రబాబుని కలవడం గంటాకి ఇష్టం లేదంటున్నారు.
టీడీపీలో వుండడం ఇష్టం లేకపోతే, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసెయ్యాలి.. లేదంటే, వైసీపీతోనో, బీజేపీతోనో, జనసేనతోనో అంటకాగాలి. అంతేగానీ, ఇలా అర్థం పర్థం లేని మౌన నాటకం ఆడితే ఎలాగన్నది గంటా అనుచరుల నుంచీ వస్తోన్న ప్రశ్న.