తెలంగాణలో కాంగ్రెస్ మహిళా ఫైర్ బ్రాండ్ నేత విజయశాంతి అంటే బీజేపీ నేతలకు అభిమానం చాలా ఎక్కువే అని తెలుస్తుంది. ఎన్నికల సమయంలో విజయశాంతి బీజేపీ మీద ఎన్నెన్ని విమర్శలు చేసిన కానీ కాషాయ దళం మాత్రం విజయశాంతి మీద ఒక్క విమర్శా కూడా చేయలేదు. బీజేపీ నుండే రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టిందనే అభిమానమో లేక అటు ఇటు తిరిగి మళ్ళీ బీజేపీ లోకి రాకపోతుందా అనే ముందుచూపు ఏమో కానీ రాములమ్మ మీద మాట వరసకు కూడా విమర్శలు చేయటం లేదు బీజేపీ నేతలు.
తాజాగా బండి సంజయ్ మాట్లాడుతూ రాములమ్మ మీద ప్రశంసల జల్లు కురిపిస్తూ, “విజయశాంతి గారు గొప్ప మహిళా నేత, ఆమెకున్న పాపులారిటీ తెలంగాణాలో మరో మహిళా నేతకు లేదు, కాకపోతే ఆమెకు సరైన రాజకీయ వేదిక దొరకకపోవడంతో ఆమె లోని రాజకీయ నాయకురాలికి సరైన గుర్తింపు రావటం లేదని” బండి సంజయ్ చెప్పుకొచ్చాడు. ఆయన మాటలు వింటే విజయశాంతి పట్ల బీజేపీ ఎలాంటి వైఖరితో ఉందొ అర్ధం చేసుకోవచ్చు, గతంలోనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వయంగా విజయశాంతి ఇంటికి వెళ్లి బీజేపీ లోకి చేరాలని కోరటం జరిగిన కానీ, ఆమె సున్నితంగా తిరస్కరించింది, అయినాగానీ బీజేపీ నేతలు ఆమె రాకకోసం ఎదురు చూస్తున్నారంటే దానికి కారణం కాంగ్రెస్ అనే చెప్పాలి.
రాములమ్మకు ఆ పార్టీలో తగిన గౌరవం లభించటం లేదనే మాటలు వినిపిస్తున్నాయి, అలాగని ఆమె తెరాస లో చేరలేదు. గతంలో బీజేపీ నుండి బయటకు వచ్చి, తల్లి తెలంగాణ అనే పార్టీని స్థాపించిన కొద్దీ రోజుల్లోనే తెరాస లో విలీనం చేసి కేసీఆర్ కు బంగారు చెల్లిగా ప్రమోషన్ పొందింది, కానీ తర్వాతి రోజుల్లో కేసీఆర్ రాజకీయాలను తట్టుకోలేక బయటకువచ్చి కాంగ్రెస్ చేరింది.
ఇక కాంగ్రెస్ నుండి బయటకు వస్తే ఆమెకున్న ఏకైక మార్గం బీజేపీ లో చేరటమే.. ఇవన్నీ గమనించిన రాష్ట్ర బీజేపీ నేతలు ఆమె పట్ల సానుకూలంగా మాట్లాడుతున్నారు, ఈ నెల పదో తేదీ దుబ్బాక ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత విజయశాంతి పార్టీ మారే విషయంలో కూడా ఒక సృష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఫలితాలు కాంగ్రెస్ కు అనుకూలంగా వస్తే కాంగ్రెస్ లో కొనసాగటమా..? వ్యతిరేకంగా వస్తే బీజేపీ లోకి వెళ్లటమా ..? అనే దాని గురించి రాములమ్మ నిర్ణయం తీసుకోవచ్చని ఆమె సన్నిహిత వర్గాలు చెపుతున్నాయి.