పంచభూతాలున్నాయ్.! అరరె బాలయ్యకి కూడా పౌరుషమొచ్చిందే.!

స్వర్గీయ నందమూరి తారకరామారావు మీద బతికుండగానే చెప్పులేయిస్తే రాని పౌరుషం, స్వర్గీయ ఎన్టీయార్ పేరుని హెల్త్ యూనివర్సిటీ బోర్డు నుంచి తొలగిస్తే ఎందుకు వచ్చింది.?

”ఎన్టీయార్ అంటే తెలుగు జాతి వెన్నుముక.. మార్చెయ్యటానికీ తీసెయ్యటానికి NTR అన్నది పేరుకాదు..ఓ సంస్కృతి.. ఓ నాగరికత.. తెలుగుజాతి వెన్నెముక..  తండ్రి గద్దెనెక్కి ఎయిర్ పోర్ట్ పేరు మార్చాడు..

కొడుకు గద్దెనెక్కి యూనివర్సిటీ పేరు మారుస్తున్నాడు.. మిమ్మల్ని మార్చటానికి ప్రజలున్నారు…… పంచభూతాలున్నాయ్ తస్మాత్ జాగ్రత్త…….

అక్కడ ఆ మహనీయుడు పెట్టిన భిక్షతో బతుకుతున్న నేతలున్నారు.. పీతలున్నారు.. విశ్వాసంలేని వాళ్లని చూసి కుక్కలు వెక్కిరిస్తున్నాయ్.. శునకాలముందు తలవంచుకు బతికే సిగ్గులేని బతుకులు..”

ఇలా సాగింది నందమూరి బాలకృష్ణ తాజా ప్రకటన సారాంశం. ఎన్టీయార్ హెల్త్ యూనివర్సిటీ పేరుని వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా వైఎస్ జగన్ సర్కారు మార్చడంపై టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ స్పందన ఇది.

అసలు పేరు మార్చాలనే ఆలోచన వైఎస్ జగన్ ఎందుకు చేశారు.? అన్నది వేరే చర్చ. ఎవరైనా ఈ విషయమై ప్రశ్నించొచ్చు. వైఎస్ షర్మిల కూడా, తన అన్న వైఎస్ జగన్ నిర్ణయాన్ని తప్పు పట్టారు. కానీ, అలా తప్పు పట్టే హక్కు ఎవరికైనా వుంటుంది.. ఒక్క టీడీపీ నేతలకు, అందునా నందమూరి కుటుంబ సభ్యులకు తప్ప.

ఎందుకు.? అంటే, ముందే చెప్పుకున్నాం కదా.. స్వర్గీయ నందమూరి తారకరామారావుని తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు పంపి, దారుణంగా అవమానించి.. చివరకు చెప్పులు ఆయన మీదకకు విసిరించి.. నానా యాగీ చేయించిన ఘటనను ఎలా మర్చిపోగలం.?

ఆ ఆత్మక్షోభతోనే కదా ఎన్టీయార్ తుదిశ్వాస విడిచింది.. అకాలమరణం చెందిందీ.! అప్పుడు రాని పౌరుషం ఇప్పుడెందుకు వస్తోంది.?