ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ పార్టీని కాపాడటం కోసం చంద్రబాబు నాయుడు బాగా కష్టపడుతున్నాడు. 2024 వరకు పార్టీలో చీలికలు రాకుండా, బిగ్ షాట్స్ ఎవరు కూడా పార్టీకి దూరంగా కాకుండా చూసుకునే పనిలో పడ్డాడు. అందులో భాగంగానే మొన్న పార్లమెంట్ స్థానాల వారీగా, అధ్యక్షులను, ఇంఛార్జి లను నియమించి జంపింగ్ ఆలోచనలో ఉన్న నేతలను ప్రస్తుతానికి ఆపగలిగాడు. ఇక తాజాగా టీడీపీ జాతీయ, రాష్ట్ర స్థాయి కమిటీలను ప్రకటించాడు చంద్రబాబు. ఇందులో కూడా జంపింగ్ చేస్తారనే అనుమానం కలిగిన నేతలకు కొన్ని కీలక పదవులు ఇచ్చాడు.
ఈ మధ్య పొలిట్ బ్యూరో పదవికి రాజీనామా చేసిన గల్లా అరుణ కుమారికి తాజాగా టీడీపీ పార్టీ సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ పదవి కట్టబెట్టాడు చంద్రబాబు నాయుడు. ఆమె పొలిట్ బ్యూరో సభ్యత్వానికి రాజీనామా చేసిన వెంటనే ఆమె పార్టీ మారబోతున్నారని, వైసీపీ లేదా బీజేపీ లోకి ఆమె వెళ్ళటం ఖాయమని, టీడీపీలో ఉంటే తనకు భవిష్యత్తు లేదని భావించే ఆమె పొలిట్ బ్యూరో పదవికి రాజీనామా చేసిందని అనుకున్నారు. ఆమె కొడుకు గుంటూరు టీడీపీ పార్లమెంట్ సభ్యుడు గల్లా జయదేవ్ అనుమతితోనే ఆమె వేరే పార్టీలోకి చేరబోతుందని అన్నారు. ఆమె వెళ్లిన వెంటనే గల్లా జయదేవ్ కూడా టీడీపీని వీడే ఆలోచనలో ఉన్నట్లు కూడా వార్తలు వచ్చాయి.
అవి నిజమా..? కాదా..? అనే విషయం పక్కన పెడితే, బాబు మాత్రం ఆ కుటుంబం టీడీపీ నుండి దూరం కాకూడదనే ఆలోచనతోనే గల్లా అరుణకు ఒక పదవి, గల్లా జయదేవ్ కు పొలిట్ బ్యూరో సభ్యుడి పదవి ఇచ్చి, ప్రస్తుతానికి వాళ్ళు టీడీపీ లోనే ఉన్నారనే సంకేతాలు బలంగా జనాల్లోకి పంపించాడు. గల్లా ఫ్యామిలీ గట్టిగా టీడీపీ నుండి వెళ్లిపోవాలని అనుకుంటే మాత్రం ఈ పదవులు వాళ్ళని ఆపలేవు. ఒకప్పుడు అమరావతి కోసం గట్టిగా పోరాటం చేసిన గల్లా జయదేవ్ గత కొద్దీ నెలల నుండి పార్టీకి దూరంగా ఉంటున్నాడు. గల్లా జయదేవ్ రాజకీయాల్లోకి రాకముందు నుండే వ్యాపారవేత్త కాబట్టి వాళ్ళ అంతిమ లక్ష్యం వ్యాపారాలను కాపాడుకోవటం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాయిస్ వినిపిస్తే ఏమవుతుందో అమరరాజా కంపెనీ విషయంలో గళ్ళ జయదేవ్ కు సృష్టంగా విషయం అర్ధం అయ్యింది, అందుకే మౌనం పాటిస్తున్నారు. ఆ మౌనాన్ని పది మంది పది రకాలుగా అనుకుంటున్నారని, వాళ్ళకి చెక్ పెట్టటానికి గల్లా ఫ్యామిలీకి పార్టీ పరంగా కీలక పదవులు కట్టబెట్టి ప్రస్తుతానికి వాళ్ళని టీడీపీ లోనే వుంచగలిగాడు బాబు