Crime News: తమిళనాడులో న్యాయమూర్తిపై ఆఫీస్ అసిస్టెంట్ హత్యాయత్నం..!

Crime News: ప్రస్తుత కాలంలో రోజు రోజుకి నేరాల సంఖ్య పెరుగుతోంది.పాత కక్షలు కుటుంబకలహాలు వివాహేతర సంబంధాలు ఆస్తి తగాదాలు వంటి అనేక కారణాల వల్ల ఎంతో మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. క్షణికావేశం లో ఆలోచనా రహితంగా చేసే పనుల వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల తమిళనాడులో న్యాయమూర్తిపై జరిగిన హత్యా యత్నం తీవ్ర కలకలం రేపుతోంది. ఆఫీస్ అసిస్టెంట్ సాధింపు చర్యగా న్యాయమూర్తి పై దాడి చేసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

వివరాలలోకి వెళితే.. కోర్టు విధుల నుండి బదిలీ చేశారన్న కోపంతో ఆఫీస్ అసిస్టెంట్ న్యాయమూర్తిపై హత్యకు పాల్పడ్డాడు.సేలం జిల్లా అస్థంపట్టిలో 24 కోర్టుల సముదాయం ఉంది. నాలుగో నేరవిభాగం కోర్టులో పొన్‌ పాండి న్యాయమూర్తిగా విధులు నిర్వర్తిస్తున్నారు. విచారణ చేయవలసిన కేసులు ఉండటంతో మంగళవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో కోర్టుకు చేరుకున్నాడు. ఆ సమయంలో అక్కడే మాటు వేసి ఉన్న ప్రకాష్‌ అనే ఆఫీస్‌ అసిస్టెంట్‌ అకస్మాత్తుగా న్యాయమూర్తిని కత్తితో పొడవబోయాడు. ఇది గమనించిన న్యాయమూర్తి అప్రమత్తం అవటం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో న్యాయమూర్తి చేతికి తీవ్ర గాయాలయ్యాయి.

ఘటన సమయంలో అక్కడున్న కొందరు వ్యక్తులు ఆఫీస్ అసిస్టెంట్ ప్రకాష్ ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు.సేలం జిల్లా అస్థంపట్టిలో నుండి ఓమలూరు అనే ప్రాంతంలోని కోర్టుకు ప్రకాష్‌ ఇటీవల బదిలీ అయ్యాడు.తన బదిలీ విషయంలో ప్రకాష్ ఇదివరకే న్యాయమూర్తితో గొడవ పడినట్లు సమాచారం. బదిలీ చేయించాడు అన్న కక్షతోనే ప్రకాష్ దాడికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది.