ములుగు జిల్లాలో దారుణం…హత్యకు గురైన సీనియర్ లాయర్?

కుటుంబ కలహాలు భార్యాభర్తలు గొడవలు పాత కక్షలు వల్ల ప్రస్తుత కాలంలో చాలామంది హత్యలు చేయడానికి కూడా వెనకాడటం లేదు. ఇటీవల ఇటువంటి దారుణ ఘటన ఒకటి చోటుచేసుకుంది. పాత కక్షలతో ములుగు జిల్లాలో ఒక సీనియర్ లాయర్ హత్యకు గురయ్యాడు. సీనియర్ లాయర్ హత్య ఘటన ములుగు జిల్లాలో తీవ్ర కలకలం రేపుతుంది. ప్రత్యర్థులే ఈ హత్యకు పాల్పడి ఉంటారని ప్రాథమిక విచారణలో పోలీసులు వెల్లడించారు.

వివరాల్లోకి వెళితే… సీనియర్ లాయర్ గా మంచి గుర్తింపు ఉన్న మల్లారెడ్డి అని న్యాయవాది రియల్ ఎస్టేట్, మైనింగ్, పెట్రోల్ పంపు, స్కూల్స్ వంటి వ్యాపారాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో కొంతకాలంగా మల్లంపల్లి పరిసర ప్రాంతాలలోని భూములకు సంబంధించిన వివాదాలలో మల్లారెడ్డి ఉన్నాడు. లాయర్ మల్లారెడ్డి కార్యకలాపాలపై గతంలో మావోయిస్టులు కూడా హెచ్చరించినట్లు తెలుస్తోంది. గతంలో మల్లారెడ్డి మీద ఒక కేసు కూడా నమోదు అయింది. గత కొన్ని రోజులుగా మల్లారెడ్డి తరచూ ములుగు ప్రాంతానికి రాకపోకలు సాగించేవాడు. ఈ క్రమంలో నిన్న మధ్యాహ్నం కూడా మల్లారెడ్డి హనుమకొండ నుండి ములుగు ప్రాంతానికి బయలుదేరాడు.

అక్కడ కలెక్టరేట్ లో కొందరు వ్యక్తులను కలిసి చర్చించుకున్న తర్వాత ములుగు నుండి మల్లారెడ్డి తిరుగు ప్రయాణం అయ్యాడు. కొంతకాలంగా మల్లారెడ్డి చర్యలను గమనిస్తున్న ప్రత్యర్థులు ఇదే అదునుగా భావించి కారులో మల్లారెడ్డిని వెంబడించారు. భూపాల్‌నగర్‌ స్టేజి వద్దకు రాగానే అదును చూసి కత్తులతో పొడిచి మల్లారెడ్డిని హత్య చేశారు. ఆ తర్వాత దుండుగులు రెండు కార్లలో అక్కడినుండి హన్మకొండ వైపు వెళ్లారని స్థానికులు చెబుతున్నారు. భూ వివాదాలే మల్లారెడ్డి హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. అయితే నిందితులు తప్పించుకొని హన్మకొండ వైపు వెళ్ళారా? లేక గుడెప్పాడ్‌ నుంచి పరకాల, భూపాలపల్లి వైపు వెళ్ళారా అని ? పోలీసులు అనుమాన పడుతున్నారు. ఈ హత్య ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించి కేసు దర్యాప్తు చేయనున్నట్లు వెల్లడించారు.