KCR To Face Arrest : అస్సాం కెలుకుడు.! కేసీయార్ అరెస్టు తప్పదా.?

KCR To Face Arrest : ఓ ముఖ్యమంత్రిని, ఇంకో ముఖ్యమంత్రి తనకున్న అధికారంతో అరెస్టు చేయించే పరిస్థితి వుంటుందా.? వుండొచ్చు, అరెస్టు చేయించాలనుకుంటున్న ముఖ్యమంత్రికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆశీస్సులు సరిగ్గా వుంటే, ఆ కేంద్ర ప్రభుత్వానికే చెందిన ముఖ్యమంత్రి తలచుకుంటే.. ఇంకో ముఖ్యమంత్రిని అరెస్టు చేయడం పెద్ద కష్టమేమీ కాదు.

ఇదీ ప్రస్తుతం రాజకీయ, మీడియా, సోషల్ మీడియా వర్గాల్లో జరుగుతోన్న చర్చ. తెలంగాణ ముఖ్యమంత్రికీ, అస్సాం ముఖ్యమంత్రికీ మధ్య నెలకొన్న చిన్నపాటి వివాదం ముదిరి పాకాన పడుతోంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అస్సాం ముఖ్యమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే, ఆ వ్యాఖ్యల్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ ఖండించారు. అదీ అసలు సంగతి.

అయినా, కాంగ్రెస్ అనే కంపని కేసీయార్ ఎందుకు తగిలించుకున్నట్టు.? అస్సాం ముఖ్యమంత్రి మీద తెలంగాణలో చాలా ఫిర్యాదులు నమోదయ్యాయి. పోలీసులు కేసుల్ని రిజిస్టర్ చేసినట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. మరి, అస్సాం ముఖ్యమంత్రి ఊరుకుంటారా.? అసలే ఆయన బీజేపీ మనిషి. దాంతో, కేసీయార్ మీద అస్సాంలో కేసులు నమోదు చేయించారట.. అదీ దేశద్రోహం సెక్షన్లు పెట్టేశారట.

సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయా.? ఆధారాలేవీ.? అని రాహుల్ ప్రశ్నిస్తే ఆయన్ని తప్పు పట్టారు.. నేనూ అదే విమర్శ చేస్తున్నా.. సమాధానం చెప్పండి.. అంటూ కేంద్రాన్నీ, బీజేపీనీ నిలదీశారు కేసీయార్. ఈ కోణంలో అస్సాంలో కేసీయార్ మీద పోలీసులకు ఫిర్యాదులు వెళ్ళాయి.

కొన్నాళ్ళ క్రితం ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ మధ్య వివాదాలొస్తే, ‘నీకు ఏసీబీ వుంటే, నాకు సీఐడీ వుంది..’ అంటూ చంద్రబాబు, కేసీయార్ మీద పంచ్ డైలాగులు పేల్చారు. ‘చంద్రబాబుని బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు’ అంటూ కేసీయార్ సవాళ్ళు విసిరారు. ఆ తర్వాత నడిచిన కథ అందరికీ తెలిసిందే. ఇప్పుడీ అస్సాం – తెలంగాణ ముఖ్యమంత్రుల పంచాయితీ ఏమవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.!