రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ చీఫ్ కాబోతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మంత్రి మండలి విస్తరణ విషయంలో తలమునకలై ఉన్న ఆయనను అకస్మాత్తుగా ఢిల్లీకి పిలిపించడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాంగ్రెస్ పార్టీకి సోనియాగాంధీ ప్రస్తుతం తాత్కాలిక అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో పార్టీకి, గాంధీ కుటుంబానికి అత్యంత విధేయుడైన గెహ్లాట్‌కు అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. రాహుల్ గాంధీ కనుక అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు నిరాకరిస్తే కనుక అశోక్ గెహ్లాట్‌కే ఆ అవకాశం దక్కే అవకాశం ఉందని సమాచారం. సోనియా అభ్యర్థనకు గెహ్లాట్ అంగీకరిస్తే కనుక రాజస్థాన్ సీఎం పగ్గాలు మరో నేత చేతుల్లోకి వెళ్తాయి.
2019 ఎన్నికల్లో పార్టీ ఓటమికి పూర్తి బాధ్యత తనదేనని, అందుకే రాజీనామా చేస్తున్నానని రాహుల్ గాంధీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అధ్యక్ష భాద్యతలు మళ్లీ సోనియా చేపట్టారు. ఈ నేపథ్యంలో త్వరలో కాంగ్రెస్ భాద్యతలు అశోక్ గెహ్లాట్ చేపట్టబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.