తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి నియామకంపై కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం మళ్లీ వాయిదా పడింది. ఈ పదవిలో సీనియర్ నేత టి.జీవన్ రెడ్డిని నియమిస్తారని, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ మంగళవారం స్వయంగా ఈ విషయాన్ని ప్రకటిస్తారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడే నిర్ణయం తీసుకోవద్దని, కొంతకాలంపాటు ఆగాలని పలువురు రాష్ట్ర నేతలు అధిష్ఠానానికి ఫోన్ చేసి చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
నాగార్జునసాగర్ ఉప ఎన్నికకు త్వరలో షెడ్యూలు వెలువడే అవకాశం ఉన్నందున ఈలోపు నిర్ణయం తీసుకోవడం సరైంది కాదని చెప్పడంతో అధిష్ఠానం తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. తొందరపడి నిర్ణయం తీసుకుంటే పార్టీలో గందరగోళం చెలరేగుతుందని, చాలా మంది నేతలు కాంగ్రె్‌సను వీడి ఇతర పార్టీల్లో చేరడంతోపాటు ప్రాంతీయ పార్టీని కూడా ఏర్పాటుచేసే అవకాశాలు ఉన్నాయంటూ వచ్చిన సమాచారం కూడా అధిష్ఠానాన్ని కలవరపరిచినట్లు తెలిసింది.
సాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో సామాజిక కూర్పు వివాదాస్పదం కాకుండా ఉండాలంటే ఆ ఎన్నిక తర్వాతే కసరత్తు కొనసాగించాలని పార్టీ అధిష్ఠానం యోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ కూడా రెండు మూడు రోజుల్లో స్వదేశానికి రానున్నందున.. ఆయన వచ్చాకే తుది నిర్ణయం వెలువడుతుందని పేర్కొన్నాయి. కాగా, టీపీసీసీ అధ్యక్ష పదవికి రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భట్టి విక్రమార్క తదితరులతోపాటు తటస్థ నేతగా జీవన్‌రెడ్డి పేరును కూడా సోనియాగాంధీ ముందుంచామని, ఆమే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఏఐసీసీ వర్గాలు చెప్పాయి. జీవన్‌రెడ్డి పీసీసీ పదవి పట్ల ఆసక్తి చూపలేదని కూడా వారు నివేదికలో ప్రస్తావించినట్లు తెలిసింది.