ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్ ఆయన వెంటనే ఆయన అరెస్ట్ ను ఖండిస్తూ ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో ఏపీ ప్రభుత్వంలో అవినీతి జరుగుతుందంటూ విమర్శలు చేస్తున్నారు. దీంతో… స్కిల్ స్కాం కేసునుంచి ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారని, పరోక్షంగా టీడీపీ కేడర్ కు కి మనోధైర్యం ప్రదర్శించే పనికి పూనుకుంటున్నారని కామెంట్లు వినిపించాయి.
ఇదే సమయంలో ఏపీలో మద్యం కుంభకోణం జరుగుతుందని, స్కిల్ స్కాం కేసులో ఏపీ సీఐడీ పై తనకు అనుమానాలు ఉన్నాయని ఆమె కామెంట్ చేశారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి మైకుల ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా పురందేశ్వరికి ఇచ్చిపడెసినంత పనిచేశారు.
ఇందులో భాగంగా చంద్రబాబు అవినీతిపరుడనే విషయం పురంధేశ్వరి భర్తతో పాటు ఆమె తండ్రి ఎన్టీఆర్, ఆమె పార్టీకే చెందిన ప్రధానమంత్రి మోడీ చెప్పారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆ ముగ్గురూ మాట్లాడిన వీడియోలు ప్రదర్శించారు. ఇదే సమయలో.. పురందేశ్వరి ఎప్పుడూ అవినీతిపరులను, నేరాలకు పాల్పడేవారినీ సపోర్ట్ చేస్తారా అని… బాలకృష్ణ కాల్పుల కేసును గుర్తుచేసే ప్రయత్నం చేశారు.
ఈ సందర్భంగా… అసెంబ్లీలో మీసాలు తిప్పుతూ, తొడగొట్టిన బాలకృష్ణ.. గతంలో తన రివాల్వర్ తీసుకుని ఇద్దరిని పిట్టలను కాల్చేసినట్లు కాల్చేశాడని.. వారిలో ఒకతని పేరు సత్యనారాయణ, ఇంకొకతని పేరు సురేష్ అని అన్నారు. ఆ సమయంలో వారిద్దరూ చావుబ్రతుకుల్లో ఉన్నారని తెలిసి, బాలకృష్ణ బయపడి పరుగెత్తుకుంటూ పురందేశ్వరి దగ్గరకు వచ్చాడని పోసాని చెప్పుకొచ్చారు.
ఆ సమయంలో బాలయ్యకు ధైర్యం చెప్పిన పురందేశ్వరి… తన భర్తను తీసుకుని వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇంటికి వచ్చిందని.. కన్నీళ్లు పెట్టుకుంటూ జరిగిన విషయాన్ని వైఎస్సార్ కి చెప్పుకుందని.. తమ్ముడు బాలయ్యను కాపాడంటూ కాళ్ల మీద పడిందని పోసాని తెలిపారు. ఆ సమయంలో కరిగిపోయిన వైఎస్సార్… బాలకృష్ణ పోలీస్ స్టేషన్ కి వెళ్లకుండా, జైలుకి వెళ్లకుండా, కోర్టుకు వెళ్లకుండా ఇంటికి పంపించేశారని అన్నారు.
ఇదే క్రమంలో అవినీతి పరులను, రౌడీలను సపోర్ట్ చేస్తున్న పురందేస్వరి “ఎన్ని సార్లు పార్టీలు మారతారు” అన్ని ప్రశ్నించిన పోసాని… అసలు ఎన్టీఆర్ వ్యతిరేకించిన కాంగ్రెస్ లో మీరు ఎలా చేరారు అని ప్రశ్నించరు. నాడు ఎన్టీఆర్ కూతురి కోటాలో మంత్రిపదవి పొంది, సోనియా గాంధీని పొగిడారని గుర్తుచేశారు. అనంతరం బీజేపీ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ను వీడారు.. బీజేపీలో చేరి ఇప్పుడు మోడీని పొగుడుతున్నారని అన్నారు. ఫలితంగా ఏపీ అధ్యక్ష పదవి పొందారని అన్నారు.
ఈ క్రమంలో పొరపాటున రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే… వెంటనే సోనియా జిందాబాద్ అంటారని పోసాని ఎద్దేవా చేశారు. ఎప్పటికీ కలవని రెండు విరుద్ధ భావాలు, సిద్ధాంతాలు కలిగిన కాంగ్రెస్, బీజేపీ… రెండింటిలోనూ తమరు ఇమడగలరని పోసాని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.