Ashok Gajapthiraju : టీడీపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు గత కొంతకాలంగా ఉనికి కోసం పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకిలా.? అన్నది వేరే చర్చ. సరే, ఆయన ఏం చేసినా.. ఈ మధ్య సింపతీ బాగా వర్కవుట్ అవుతోంది. మన్సాస్ ట్రస్ట్ విషయంలో అధికార వైసీపీ అత్యుత్సాహం కాస్త అశోక్ గజపతిరాజుకి అడ్వాంటేజ్ అయిన మాట వాస్తవం.
పోదరుడి కుమార్తె చేతిలో ‘ఓటమి’ అనే స్థాయి పరిస్థితులు వచ్చేశాయి. కారణం, అశోక్ గజపతిరాజు సోదరుడి కుమార్తె సంచైత అనూహ్యంగా మన్సాస్ పగ్గాలు దక్కించుకున్నారు.. ఆ తర్వాత ఆమె అదే దూకుడుతో అశోక్ గజపతిరాజు మీద అత్యుత్సాహం ప్రదర్శించి అభాసుపాలయ్యారు. చివరికి మన్సాస్ ట్రస్టు అశోక్ గజపతిరాజు చేతిలోకే వెళ్ళింది.
ఇక, అసలు విషయానికొస్తే, విజయనగరం జిల్లాలోని ప్రముఖమైన రాములోరి దేవాలయం రామతీర్థంలో కొన్నాళ్ళ క్రితం రాములోరి విగ్రహం ధ్వంసమైంది దుండగుల దుశ్చర్యకారణంగా. ఆ విగ్రహాన్ని పునఃప్రతిష్ట చేయడంతోపాటు, దేవాలయ నిర్మాణానికి ప్రభుత్వం ముందుకొచ్చింది.
తాజాగా, దేవాలయానికి శంకుస్థాపన చేయగా, ఈ వ్యవహారంలో అశోక్ గజపతిరాజు అత్యుత్సాహం ప్రదర్శించారు. దేవాలయ అనువంశిక ధర్మకర్తనైన తనకు సరైన సమాచారం ఇవ్వలేదంటూ అశోక్ గజపతిరాజు గుస్సా అయ్యారు. అంతేనా, శంకుస్థాపన కార్యక్రమం జరుగుతున్న సమయంలో ‘సర్కస్’ అంటూ అసహనం వ్యక్తం చేశారు.
ఈ మొత్తం వ్యవహారంలో అధికార పార్టీ అత్యుత్సాహం ఓ యెత్తు.. అశోక్ గజపతిరాజు సంయమనం కోల్పోవడం ఇంకో యెత్తు.. అన్నట్టుగా మారింది పరిస్థితి. అయినాగానీ, ‘పెద్దాయనను పక్కకు తోసేశారు..’ అన్న విషయమే హైలైట్ అవుతోంది. ఈ పచ్చ రాజకీయం ఇంకోసారి అశోక్ గజపతిరాజుకి బాగానే వర్కవుట్ అయినట్టుంది.