కుప్పంలో అరెస్టులు.. దేనికి సంకేతం చెప్మా.?

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సొంత నియోజకవర్గం కుప్పలో ఇటీవల ఆయన పర్యటిస్తున్న సమయంలో పెద్ద యాగీ జరిగింది. టీడీపీ వర్సెస్ వైసీపీ.. పెద్ద యుద్ధమే జరిగింది కుప్పం నియోజకవర్గంలో. వైసీపీ శ్రేణుల్ని చంద్రబాబు తన ప్రసంగాలతో రెచ్చగొట్టడం, అదే సమయంలో వైసీపీ శ్రేణులు చంద్రబాబుకి వ్యతిరేకంగా ఆందోళనలు చేయడం.. వెరసి.. ఇరువురూ ఒకర్నొకరు రెచ్చగొట్టుకున్నారు. టీడీపీ శ్రేణులు, వైసీపీ శ్రేణులు బాహాబాహీకి దిగాయి. యుద్ధ వాతావరణం నెలకొంది. పలువురికి ఈ దాడుల్లో గాయాలయ్యాయి కూడా.

చంద్రబాబు పర్యటన ముగిసింది. ఇప్పుడు అరెస్టుల పర్వానికి తెరలేచింది. వైసీపీ నేతల ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేశారు, పలువుర్ని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. మరోపక్క టీడీపీ ఫిర్యాదు మేరకు కూడా ఓ కేసు నమోదయ్యిందట. ఆ విషయమై ఎంతమంది అరెస్టయ్యారన్నదానిపై సమాచారం అందాల్సి వుంది. వైసీపీ నేతలు ఎక్కువ కేసులు పెట్టారు.. టీడీపీ నేతలు తక్కువ కేసులు పెట్టారని అనుకోవాలా.? కేసులు నమోదైన తీరు చూస్తే అలాగే అనిపించకమానదు.

రాజకీయాల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలు సర్వసాధారణం. ఘర్షణ, ఆందోళనలు, తీవ్రమైన గొడవలు.. ఇవన్నీ సర్వసాధారణమైపోయాయి. ఈ క్రమంలో అధికార పార్టీ నేతలు, కార్యకర్తలపై కేసులు నమోదు చేయడానికి పోలీసు వ్యవస్థ తటపటాయిస్తోందన్న విమర్శ ఈనాటిది కాదు. చంద్రబాబు హయాంలోనూ అదే జరిగింది. ఇప్పుడూ అదే జరుగుతోంది కూడా.!

టీడీపీ స్థాపించిన అన్నా క్యాంటీన్‌ని వైసీపీ శ్రేణులు ధ్వంసం చేయడం, అదే సమయంలో టీడీపీ కార్యకర్తలు – వైసీపీ కార్యకర్తలు పరస్పర దాడులు చేసుకోవడం వెరసి.. కుప్పం చంద్రబాబు పర్యటనతో రణరంగంగా మారిపోయింది. అంత పెద్ద గాలాటా జరిగితే, పదుల సంఖ్యలో ఫిర్యాదులు వెళ్ళాల్సింది పోయి.. మరీ ఇంత తక్కువగా ఫిర్యాదులు వచ్చాయా.? అన్న చర్చ కూడా స్థానికంగా జరుగుతోంది.

ప్రతిపక్ష నేత పర్యటనకు సరైన భద్రత కల్పించలేని పోలీస్ వ్యవస్థ, అక్కడేమైనా గలాటా జరుగుతుందేమో.. అని కూడా ముందస్తు చర్యలు తీసుకోలేని ఇంటెలిజెన్స్ వ్యవస్థ.. వీటి గురించి ఇప్పుడు జన బాహుళ్యంలోనూ చర్చ జరుగుతోంది. పనిగట్టుకుని రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు చేసే రెచ్చగొట్టే చర్యలకు పోలీసు వ్యవస్థని బాధ్యుల్ని చేయడం ఎంతవరకు సబబు.? అన్న వాదన కూడా లేకపోలేదు.