Health Tips: అనేకమంది నోటి దుర్వాసన సమస్యతో బాధపడుతుంటారు. ఇది చిన్న సమస్యనే అయినా ఎవరితో మాట్లాడాలన్నా లేదా తమకు తామే ఆ వాసన వల్ల చాలా చిరాకు గా ఫీల్ అవుతుంటారు. ఇది చిన్నపిల్లలలో మాత్రమే కాదు పెద్దవారిలో కూడా చాలా ఇబ్బంది కలిగించే సమస్య. దీనిని తగ్గించుకోవడానికి చాలానే కుస్తీ పడుతుంటారు. కొంతమందిలో ఉదయం, రాత్రి బ్రష్ చేయడం మౌత్ వాష్ వాడటం వల్ల ఈ వాసన తగ్గిపోతుంది. అయితే కొందరిలో ఏం చేసినా కూడా నోటి దుర్వాసన అలాగే ఉంటుంది. ఇలాంటి వారు దీనిని అసలు నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే మీ శరీరంలో ఉత్పన్నమయ్యే కొన్ని వ్యాధులకు నోటిదుర్వాసన సంకేతం కావచ్చు.
మూత్రపిండాల (కిడ్నీ) సమస్యలతో బాధపడేవారికి నోటి దుర్వాసన అనేది సహజం. ఇటువంటి సమస్యలతో బాధపడేవారికి నోటి దుర్వాసన అనేది ఒక సంకేతంగా ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. కిడ్నీ వ్యాధులు ఉన్నప్పుడు, కిడ్నీలు సక్రమంగా పని చేయనప్పుడు రక్తప్రవాహంలో యూరియా మోతాదు అధికమవుతుంది. ఫలితంగా నోటి దుర్వాసన అధికమవుతుంది.
మూత్రపిండాల సమస్యలు కాకుండా మధుమేహ వ్యాధితో బాధపడుతున్న వారిలో కూడా నోటి దుర్వాసన ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది మదుమోహం వ్యాధితో బాధపడుతున్నారు. మధుమేహ వ్యాధి బారిన ఒకసారి పడితే దానిని నివారించడం అంత సులువైన విషయం కాదు. అయితే దీనిని మొదటి దశలో గుర్తించినట్లయితే కొన్ని నివారణ చర్యలు చేపట్టవచ్చు. నోటి దుర్వాసన మధుమేహ వ్యాధి మొదటి దశ సంకేతాలుగా డాక్టర్లు చెబుతున్నారు. నోటినుండి దుర్వాసన వస్తుంటే ఒకసారి షుగర్ టెస్ట్ చేయించడం మంచిది.
శరీరానికి అవసరమైన నీటిని తాగకపోవడం వల్ల కూడా నోరు పొడి బారి దుర్వాసన వస్తుంది. నీటిని తక్కువగా తాగడం వల్ల బాడీ డీహైడ్రేషన్ కి గురి అయ్యే ప్రమాదం ఉంది. నోటి నుండి దుర్వాసన వస్తుంటే శరీరానికి తగినంత నీరు తాగడం లేదని అర్థం. నీరు అధికంగా తాగడం, రెండు పూటలా బ్రష్ చేయడం, మౌత్ వాష్ వాడటం ఇలా ఎన్ని చేసినా కూడా మీ నోటి దుర్వాసనను నివారించ లేకపోతే వెంటనే డాక్టర్ను సంప్రదించడం మంచిది.