ఆయుర్వేదంలో తులసి ఆకులను దివ్య ఔషధంగా పరిగణించారు. మన భారత దేశంలో తులసి చెట్టును పూజించడమే కాకుండా వాటిని ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగిస్తారు. తులసి ఆకులలో ఉండే ఎన్నో ఔషధ గుణాలు అనేక ఆరోగ్య సమస్యల నుండి విముక్తిని కలిగిస్తాయి అందువల్ల ప్రతిరోజు రెండు తులసి ఆకులను తినటం ఆరోగ్యానికి మంచిదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో వచ్చే జలుబు, దగ్గు, జ్వరం వంటి సీజనల్ వ్యాధుల నుండి కాపాడటంలో తులసి ఎంతో ఉపయోగపడుతుంది. అయితే ఆరోగ్యానికి మంచిది కదా అని అధిక మోతాదులో తులసి ఆకులు తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. తులసి ఆకులు ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
తులసి ఆకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ అధిక మోతాదులో తులసి ఆకులు తినటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుందని ఆయుర్వేద నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా గర్భంతో ఉన్న మహిళలు తులసి ఆకులను ఎక్కువగా తినటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. గర్భంతో ఉన్న మహిళలు అధిక మోతాదులో తులసి ఆకులు తినడం వల్ల తల్లి మరియు బిడ్డ దీర్ఘకాలిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాకుండా గర్భాశయ సమస్యలు ఏర్పడే ప్రమాదం కూడా ఉంటుంది. అందువల్ల గర్భిణీ స్త్రీలు తులసిని తీసుకునే ముందు డాక్టర్ ని సంప్రదించటం చాలా అవసరం.
శాస్త్రవేత్తలు వెల్లడించిన అధ్యయనాల ప్రకారం తులసి ఆకులు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో సంతానోత్పత్తి స్థాయిని తగ్గిస్తుంది. ముఖ్యంగా పురుషులు తులసి ఆకులను ఎక్కువగా తీసుకోవడం వల్ల వారిలో వీర్యకణాల సంఖ్య తగ్గే ప్రమాదం ఉంటుంది. అందువల్ల పిల్లల కోసం ప్రయత్నిస్తున్న భార్యాభర్తలు తులసి ఆకులకు దూరంగా ఉండాలి. గర్భం దాల్చిన మహిళలు తులసి ఆకులకు దూరంగా ఉండాలి. అయితే తులసి ఆకులలో యూజెనాల్ అనే పదార్థం అధిక మోతాదులో ఉంటుంది. అందువల్ల తులసి ఆకులు ఎక్కువగా తీసుకోవడం వల్ల నోరు మరియు గొంతులో మంట, గుండే దడ పెరగటం, వికారం, మూర్ఛలు మరియు తలతిరగడం వంటి సమస్యలకు దారి తీస్తుంది.