కరోనా వైరస్ విషయంలో వ్యాక్సిన్ల సామర్థ్యం ఎంత.? మొదటి నుంచీ ఈ ప్రశ్న అందర్నీ వేధిస్తూనే వుంది. నిజానికి, ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో వున్న వ్యాక్సిన్లన్నీ అత్యవసర అనుమతులు పొందినవే. దేన్నీ పూర్తిస్థాయి వ్యాక్సిన్ అనలేం.. అన్న అభిప్రాయం కొందరు వైద్య నిపుణుల్లో వుంది. కరోనా వైరస్ వచ్చి ఏడాదిన్నర దాటేసింది.. అయినా, ఇంకా కరోనా వైరస్ దేశవ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా అదుపులో లేకుండా పోయింది. కొన్ని దేశాలు రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్ చేస్తున్నాయి. కోట్ల సంఖ్యలో వ్యాక్సిన్లు జనానికి అందాయి. అయినా, ఎందుకు కరోనా వైరస్ అదుపులోకి రావడంలేదు.? అమెరికానే తీసుకుంటే, అక్కడ ప్రతిరోజూ లక్షన్నర కేసులు నమోదవుతున్నాయి గత కొద్ది రోజులుగా. అమెరికాలో రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్ జరిగింది. రెండు డోసుల వ్యాక్సిన్ సరిపోవడంలేదు, మూడో డోస్ కూడా ఇస్తేనే పూర్తి సమర్థవంతంగా కరోనా వైరస్‌ని నియంత్రించగలమన్నది అక్కడి నిపుణుల వాదన.
‘ఒక్క డోస్ వ్యాక్సిన్ మీద ఫోకస్ పెట్టండి.. రెండో డోస్ పేద దేశాలకు ఇవ్వండి..’ అంటూ పలువురు నిపుణులు, విశ్లేషఖులు అభిప్రాయపడుతున్నారు. కానీ, ఏ దేశానికి ఆ దేశం.. తమ ప్రజల్నే ప్రయార్టీ కేటగిరీ కింద చూడటం సహజం. అయితే, ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులు అదుపు తప్పుతున్నాయి. ఎప్పుడు ఏ కొత్త వేరియంట్ విరుచుకుపడుతుందో తెలియని పరిస్థితి. ఆ మాటకొస్తే కోవిడ్ 19 అనే వైరస్ గురించి పూర్తి సమాచారం మనకి తెలియదన్న చర్చ కూడా జరుగుతూనే వుంది. ఏది నిజం.? వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతున్నా కరోనా వైరస్ అదుపులోకి రావడంలేదంటే, కరోనా వైరస్.. ఈ వ్యాక్సిన్లకు లొంగడంలేదనే అర్థం. వ్యాక్సిన్ వేసుకున్నా మాస్కులు ధరించాలి.. లేదంటే, కరోనా బారిన పడటమే కాదు.. ఇతరులకూ అంటించేస్తాం.. అని వైద్య నిపుణులు కుండబద్దలుగొట్టేస్తున్నారు. మరెందుకు వ్యాక్సిన్ వేసుకోవడం.? అంటే, వైరస్ వల్ల కలిగే దుష్ప్రభావాల తీవ్రతను తగ్గించడం కోసమే వ్యాక్సిన్.