పండుగల సీజన్ అంటే రాష్ట్ర రవాణా సంస్థకు భారీ ఆదాయాలు తెచ్చుకునే సౌలభ్యం ఉంటుంది. ఎప్పుడూ అప్పుల్లో కొట్టుకునే ఆర్టీసీకి పండుగ సెలవులు కొంత ఊరటని ఇస్తుంటాయి. సంక్రాతి తర్వాత తెలుగు ప్రజలు ఎక్కువగా ఎదురుచూసే పండుగ దసరా. ఎందుకంటే ఎక్కువ మొత్తంలో సెలవులు వస్తాయి కాబట్టి. వారంతపు సెలవులు కలిసొచ్చి వారం రోజులు సెలవులు దొరికితే హైదరాబాద్లో ఉద్యోగం చేసుకునే చాలా కుటుంబాలు సొంత ఊళ్లకు బయలుదేరుతాయి. అప్పుడు సాధారణ స్థాయిలో ఉండే ఫ్లో కంటే బస్సుల్లో ఎక్కువ ఫ్లోట్ ఉంటుంది.
కోవిడ్ భయం ఉంది కాబట్టి గతంలో మాదిరి కాకపోయినా ఒక మాదిరి రద్దీ అయినా ఉండేది. ఈ సమయంలో ఇరు రాష్ట్రాల మధ్యన బస్సులు తిప్పగలిగితే కొన్ని నెలలుగా స్తంభించిపోయిన ఆర్టీసీ ఎంతో కొంత రాబడి చూసేది. అలా అనుకునే జగన్ సర్కార్ బస్సుల రాకపోకల విషయమై తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు మొదలుపెట్టింది. ఆ చర్చలు ఫలించి ఉంటే లాక్ డౌన్ అనంతరం అంతర్ రాష్ట్ర రవాణా మొదటిసారి రీస్టార్ట్ అయ్యుండేది. కానీ చర్చలు ఫలించలేదు. తెలంగాణ భూభాగంలో ఆంద్ర బస్సులు ఎక్కువగా తిరుగుతున్నాయని, దాన్ని తగ్గించాలని కేసీఆర్ సర్కార్ షరతు పెట్టింది.
పలు దఫాల చర్చల తర్వాత ఏపీ ప్రభుత్వమే దిగివచ్చి తెలంగాణ భూభాగంలో లక్ష కిలోమీటర్లను తగ్గించుకుంటామని ముందుకొచ్చింది. అయినా తెలంగాణ వైపు నుండి వేగవంతమైన స్పందన కరువైంది. రూట్ల వారీ వివరాలు కావాలని పేచీ పెట్టింది. అవి సమర్పించినా ఇంకా రియాక్షన్ రాలేదు. పండుగకు ఒక్క రోజే మిగిలి ఉంది. ఈరోజు గనుక ముగిసిపోతే రేపటి నుండి బస్సుల రాకపోకలు మొదలుపెట్టినా నిర్వహణ భారం తప్ప ఆదాయం అస్సలు ఉండదు. మొత్తానికి కేసీఆర్ మౌనం ఏపీ ప్రభుత్వం రాబడికి గండికొట్టేసింది.