గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల విషయంలో గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. నీటి పంపకాల విషయంలో రెండు రాష్ట్రాలు కయ్యానికి కాలు దువ్వాయి. దీంతో తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలను పరిష్కరించేందుకు అపెక్స్ కౌన్సిల్ ను కేంద్ర జలశక్తి నియమించింది.
ఆ సమావేశం తాజాగా ప్రారంభమైంది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభమైంది. మధ్యాహ్నం 12 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కాగా… ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్.. ఢిల్లీలోని తన అధికార నివాసం నుంచి అధికారులు, వైసీపీ ఎంపీలతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు.
మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే ఈ సమావేశానికి హాజరు అయ్యారు. హైదరాబాద్ నుంచి నీటిపారుదల శాఖ అధికారులతో కేసీఆర్ ఈ సమావేశానికి హాజరయ్యారు.
రెండు రాష్ట్రాలు కృష్ణా జలాల వివాదంపై గట్టిగానే వాదించడానికి సిద్ధమయ్యాయి. కేంద్రం కూడా ఈ సమావేశం తర్వాత కొన్ని నిర్ణయాలు తీసుకోనున్నట్టు సమాచారం. మొత్తం మీద ఈ కౌన్సిల్ సమావేశంలో నాలుగు అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు.