ఏపీలో వరుసగా హిందూ దేవాలయాలపై దాడులు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా విజయనగరం జిల్లాలోని రామతీర్థంలో రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన ఏపీలో చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై ప్రతిపక్షాలు కూడా మండిపడుతున్నాయి. అన్ని వేళ్లు సీఎం జగన్ వైపే చూపిస్తుండటంతో జగన్ కూడా దీనిపై చాలా సీరియస్ గా ఉన్నారు.
అయితే.. తాజాగా ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈ ఘటనపై ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. జగన్ పాలనలో రోజుకో గుడిపై దాడులు జరుగుతున్నాయని అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. జగన్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కాలేదు కానీ వందల సంఖ్యలో గుళ్లపై దాడులు చోటు చేసుకున్నాయన్నారు.
మన భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు ఎప్పుడైనా గుళ్లపై దాడులు జరిగాయా? దేవుడి విగ్రహాలను ధ్వంసం చేశారా? కానీ.. జగన్ మోహన్ రెడ్డి పాలనలో మాత్రం ఏపీలోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి అంటూ ఆయన ఆరోపించారు.
జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని దేవాలయాలపై దాడులు జరిగాయో… వాటి లిస్ట్ అంతా తమ వద్ద ఉన్నాయని ఆయన అన్నారు. దేవాలయాలపై ఇన్ని దాడులు జరుగుతున్నా సీఎం జగన్ ఎందుకు స్పందించడం లేదు. ఎందుకు అక్కడికి వెళ్లి పరిశీలించడం లేదు. బాధ్యులపై కఠిన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు.. అంటూ ప్రశ్నించారు.
ఇక.. మంత్రి కొడాలి నాని.. ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదు. ఆయన ఇష్టమున్నట్టు మాట్లాడుతారు. ఆయన్ను అప్పుడే కంట్రోల్ చేసి ఉంటే.. ఆనాడే కఠినంగా చర్యలు తీసుకొని ఉంటే.. ఇప్పుడు ఇన్ని సమస్యలు వచ్చేవా? అంటూ అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.