ప్రభుత్వం అంటే పేద కుటుంబాలకు పెద్ద కొడుకులా ఉండాలని వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనేవారు. పాదయాత్రలో ఆయన పలకరించిన ప్రతి కుటుంబానికి ‘నేను విన్నాను.. నేను ఉన్నాను’ అంటూ హామీ ఇచ్చారు. ప్రతి పేద కుటుంబానికి పెద్ద కొడుకులా ఉంటానని మాటిచ్చారు. ఆ మాట మేరకే ముఖ్యమంత్రి అయినా వెంటనే ఉచిత కరెంట్ ఫైల్ మీద సంతకం చేసి సంక్షేమ విప్లవం తీసుకొచ్చారు. పేదలకు సైతం కార్పొరేట్ వైద్యం అందాలనే లక్ష్యంతో ఆరోగ్య శ్రీని ప్రవేశపెట్టారు. రెండు రూపాయల కిలో బియ్యం, 108, 104 అంబులెన్సులు, పావలా వడ్డీ రుణాలు, ఫీజు రీఎంబర్సిమెంట్, రాజీవ్ ఆరోగ్య శ్రీ, ఇందిరమ్మ ఇళ్ళు అంటూ పేదల బాగు కోసం అహర్నిశలూ తపించారు. ఆ తపనే ఆయన్ను జనం గుండెల్లో జనహృదయ నేతగా నిలబడిపోయేలా చేసింది.
ఈనాడు ఆయన తనయుడు వైఎస్ జగన్ సైతం అదే బాటలో అడుగులు వేస్తున్నారు. సంక్షేమ పథకాల కోసం వేల కోట్లు వెచ్చిస్తున్నారు. ఆనాడు వైఎస్ ప్రవేశపెట్టిన పథకాలను కొనసాగిస్తూనే కొత్తగా అమ్మఒడి, జగనన్న ఆసరా, వైఎస్ఆర్ భరోసా, బీసీ కార్పొరేషన్లు, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యాకానుక, రైతు భరోసా ఇలా ఇప్పటికే పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఆయన కొత్తగా వైఎస్ఆర్ బీమాను తీసుకొచ్చారు. బియ్యం కార్డు ఉన్న ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వమే భీమా కట్టేలా ముందుకొచ్చారు. నిజానికి ఈ పథకం కేంద్ర ప్రభుత్వం సహకారంతో నడవాల్సి ఉంది. కానీ కేంద్రం ఈ పథకం నుండి వైదొలగింది. అయినా జగన్ వెనకడుగు వేయలేదు. మొత్తం భారం రాష్ట్ర ప్రభుత్వమే మోస్తూ భీమా పతకాన్ని శ్రీకారం చుట్టారు.
ఈ భీమా పథకం ద్వారా కోటి 41 లక్షల కుటుంబాలకు భీమా సౌకర్యం కలగనుంది. ప్రమాదాల్లో మరణించిన, వైకల్యం సంభవించిన కుటుంబాలకు బీమా వర్తిస్తుంది. 18 నుండి 50 ఏళ్ల మధ్య వారు ప్రమాదవశాత్తు మరణిస్తే 5లక్షలు. సహజ మరణానికి 2లక్షలు. ప్రమాదంలో పాక్షిక వైకల్యం కలిగితే 1.5 లక్షల బీమా. 51 నుండి 70 ఏళ్ల మధ్య వారు మరణిస్తే 3లక్షలు బీమా. ప్రమాదవశాత్తు మరణిస్తే 10వేల భీమా ఇవ్వనున్నారు. ఈ పథకం కోసం ప్రభుత్వం ఏటా 510 కోట్లు వెచ్చించనుంది. నిజంగా ఇది పేద కుటుంబాలకు శుభవార్తే. ప్రభుత్వం అప్పుల పాలవుతోంది, అభివృద్ధి లేదు, అప్పు తెచ్చి సంక్షేమం అవసరమా లాంటి విమర్శలు ఎలా ఉన్నా ఈ భీమా పథకం మాత్రం ప్రభుత్వం ఎన్ని అప్పుల్లో ఉన్నా అమలుచేసి తీరవలసిన పథకం. అందుకే జనం ఆనాడు రాజన్న, ఈనాడు జగనన్న ఏనాడూ జనాన్ని మరువలేదు అంటూ కొనియాడుతున్నారు.