కులాల, మతాల ప్రస్తావన లేకుండా మన దేశ రాజకీయల గురించి మాట్లాడటం చాలా కష్టం. ఎందుకంటే నాయకులే సిగ్గు లేకుండా బహిరంగంగా కులాల గురించి, మతాల గురించి మాట్లాడుతూ ప్రజలను రెచ్చగొడుతుంటారు. రాజకీయాల్లో ఎంతకాదనుకున్నా కూడా కుల రాజకీయాలు, మత రాజకీయాలు నడుస్తూనే ఉంటాయి. అయితే ఇప్పుడు ఏపీలో రాజకీయాలు కాపు కులస్తులు చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. కాపులను ఆకర్షించడానికి వైసీపీ నాయకులు, టీడీపీ నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
చంద్రబాబును కాపు కులస్తులు వద్దంటున్నారా!
తెలుగుదేశం మొదటి నుంచి బిసిలకు కాసిన్ని ఎమ్మెల్యే పదవులు ఇస్తూ, వారి ఓట్లను సంపాదించి, అధికారం అందుకుంటూ వస్తోంది. 2019 ఎన్నికల ముందుగా మెలమెల్లగా కాపుల వైపు మొగ్గుతూవచ్చింది. ఎందుకంటే అప్పటికే కాపులు వైకాపా వైపు మొగ్గుతున్నారన్న అనుమానం రావడం వల్ల. అందులో భాగంగానే కళా వెంకట్రావుకు పార్టీ అధ్యక్షపదవి ఇచ్చారు.
అయితే కేవలం ఎన్నికల సమయంలోనే తమను పట్టించుకుంటున్నారని, మళ్ళీ ఎన్నికలు వస్తే తమను చంద్రబాబు వదిలేస్తాడని తెలుసుకున్న కాపు కులస్తులు చంద్రబాబును దూరం పెడుతున్నారు. జాతీయ పార్టీ భాజపా కూడా కాపుల మీద దృష్టి పెట్టింది. ఇటు పవన్ కళ్యాణ్, అటు వీర్రాజుల ద్వారా పార్టీకి కాపుల బలం సమకూర్చే పనిలో పడింది. కచ్చితంగా ఇక కాపుల బలం మూడు కింద చీలాల్సిందే. ఇటు వైకాపా కొంత, అటు తేదేపా కొంత, ఇక జనసేన తనకు సాధ్యమైనంత లాగేస్తాయి
జగన్ ను కాపు కులస్తులు అక్కున చేర్చుకుంటారా!
2019 ఎన్నికల్లో బిసిలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అక్కున చేర్చుకున్నారు. అందుకే జగన్ బిసి ల రుణం తీర్చుకోవడానికి వారికి ప్రత్యేక నగదు స్కీములు ప్రవేశ పెట్టారు. మరోపక్కన బిసి ల్లో వివిధ కులాలకు వేర్వేరు కార్పొరేషన్లను ఏర్పాటుచేయాలని జగన్ ఆలోచిస్తున్నారు. అది కనుక చేస్తే ఇక బిసి ల్లో మెజారిటీ కులాలు ఆయనవెంటే వుండే అవకాశం వుంది. అలాగే ఆయన వచ్చే ఎన్నికల సమయం వరకు కాపు కులస్తులును కూడా తన వైపు తిప్పుకోవడానికి జగన్ తన పార్టీ నేతలతో ఇప్పటికే పథకాలు రచిస్తున్నారు. కాపు కులస్తులను ఆకర్షించడానికి టీడీపీ, జనసేన, బీజేపీ పోటీ పడుతున్నప్పటికి అధికారంలో ఉన్న వైసీపీ వైపే కాపులు మొగ్గు చూపే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి.