ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం. జగన్ సర్కార్ కి రాష్ట్రంలో తిరుగులేదు అని మరోసారి రుజువయింది. మొత్తం 75 మున్సిపాలిటీలు, 12 కార్పొరేషన్లలో ఎన్నికలు జరిగాయి. ఐతే హైకోర్టు ఆదేశాలతో ఏలూరు కార్పొరేషన్‌లో ఫలితాలను వెల్లడించలేదు. మిగిలిన 11 కార్పొరేషన్లలో 11 వైసీపీయే గెలిచింది. 73 మున్సిపాలిటీల్లో తాడిపత్రి, మైదుకూరు మినహా అన్ని చోట్లా వైసీపీకే ప్రజలు జైకొట్టారు. విజయనగరం, విశాఖపట్నం, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, ఒంగోలు, తిరుపతి, చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప కార్పొరేషన్లలో వైసీపీ విజయం సాధించింది.
ఈ మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అట్టర్ ఫ్లాపయింది. కేవలం రెండు మున్సిపాలిటీలకే పరమితమయింది. ఇక జనసేన, బీజేపీ కూడా ఘోరంగా విఫలమయ్యాయి. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైసీపీలో సరికొత్త జోష్ నింపాయి. పార్టీ నేతలు సంబరాల్లో మునిగిపోయాయి. రాష్ట్ర ప్రజలంతా జగన్ వైపే ఉన్నారని మరోసారి నిరూపితమయిందని ఆ పార్టీ నేతలు తెలిపారు. విపక్షాలను తిరస్కరించారని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం పథకాలకు ఏపీ ప్రజలు నూటికి నూటికి శాతం మద్దతు తెలిపారని హర్షం వ్యక్తం చేశారు.
ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్పందించారు. ట్విటర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలారా… స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ విజయం కోసం మీలో ప్రతిఒక్కరూ ఎంతో కష్టపడ్డారు. కొన్నిచోట్ల ప్రాణాలు సైతం పణంగా పెట్టి పార్టీకి అండగా నిలిచారు. మీ పోరాటస్ఫూర్తికి వందనాలు. ప్రస్తుత ఫలితాల విషయానికి వస్తే, నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదు. రౌడీయిజం, బెదిరింపులు, అధికార దుర్వినియోగం, ప్రలోభాలు ఉన్నప్పటికీ గట్టిగా పోరాడాం. ప్రజా సమస్యల పరిష్కారం, రాష్ట్ర భవిష్యత్తు లక్ష్యంగా ముందుకు కొనసాగుదాం. ఇదే స్ఫూర్తితో పనిచేస్తే రాబోయే రోజుల్లో విజయం మనదే.’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.